కమలపై యూదుల్లో ఆగ్రహం
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:14 AM
ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రాజకీయం చేస్తే.. అది అడ్డం తిరిగి మరో వర్గం మొత్తానికే దూరమై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు రుజువు కాబోతోందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది!
పిట్స్‌బర్గ్‌లో ఆమె ప్రచార బృందంలో ఇజ్రాయెల్ వ్యతిరేకుల ప్రసంగాలు
ముస్లిం, అరబ్ ఓట్ల కోసం యత్నం
ఆమెకు ఓటేయబోమంటున్న యూదులు
పిట్స్‌బర్గ్, నవంబరు 4: ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రాజకీయం చేస్తే.. అది అడ్డం తిరిగి మరో వర్గం మొత్తానికే దూరమై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు రుజువు కాబోతోందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది! ముస్లింలు, అరబ్బుల ఓట్ల కోసం.. ఇజ్రాయెల్ వ్యతిరేక యాక్టివిస్టులతో కలిసి పెన్సిల్వేనియాలో కమలా హ్యారిస్ చేస్తున్న ప్రచారం యూదుల్లో కోపానికి కారణమవుతోంది. దీనివల్ల ఆమె ఆ రాష్ట్రానికి ఉన్న 19 ఎలక్టోరల్ ఓట్లనూ కోల్పోయే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇటీవల పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆమెతోపాటు ఉండి, ప్రసంగాలు చేసినవారిలో.. పిట్స్‌బర్గ్ మేయర్ ఎడ్ గెయినీ, ఎలిఘెనీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ సారా ఇనమొరాటో ఉన్నారు.
వారిద్దరూ ఇజ్రాయెల్ వ్యతిరేకులే. 2023 అక్టోబరు 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్‌పై జరిపిన దాడి గుర్తుందా? ఆ దాడికి జవాబుదారీ ఇజ్రాయెలేనన్నది వారి వాదన. ఈమేరకు.. స్థానిక డెమొక్రాటిక్ పార్టీ ప్రజాప్రతినిధి సమ్మర్‌లీతో కలిసి వారొక ప్రకటన కూడా విడుదల చేశారు. అసలే వారి ప్రకటనతో రగిలిపోతున్న యూదుల కోపం.. వారిని వెంటబెట్టుకుని ప్రచారానికి వచ్చిన కమలపైకి మళ్లింది.
అధికారిక గణాంకాల ప్రకారం.. పెన్సిల్వేనియా రాష్ట్రంలో 4 లక్షల మందికి పైగా యూదులున్నారు. అక్కడ గెలవాలంటే వారి ఓట్లు చాలా కీలకం. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా ట్రంప్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు స్థానిక వార్తాసంస్థల కథనాల సమాచారం.
యూదు ఓటర్లే కాదు.. డెమొక్రాటిక్ పార్టీలో ఉన్న పలువురు యూదు ప్రతినిధులు కూడా పార్టీ తమను మోసం చేసినట్టు భావిస్తున్నారు. నిజానికి.. 1924 నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ యూదు ఓటర్ల మద్దతు డెమొక్రాటిక్ పార్టీకే. ఇప్పుడు కమల తీరుతో ఆ ఆనవాయితీ తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ప్రభావం ఒక్క పెన్సిల్వేనియా రాష్ట్రానికే పరిమితమవుతుందా? లేక అన్ని రాష్ట్రాల్లోనూ యూదు ఓటర్ల కోపం ట్రంప్‌కు వరంగా మారుతుందా? అంటే.. వేచి చూడాల్సిందే!!
Updated Date - Nov 05 , 2024 | 03:16 AM