Karachi : పాక్‌లో నరమేధం
ABN, Publish Date - Aug 27 , 2024 | 05:15 AM
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
21 మంది టెర్రరిస్టులు సహా 73 మంది మృతి
బలూచిస్థాన్‌లో పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు,
హైవేలే లక్ష్యంగా దాడులు
ఉగ్రదాడుల్లో 73 మంది మృతి.. 38 మంది పౌరులు.. 14 మంది పోలీసులు
కరాచీ, ఆగస్టు 26: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో మొత్తం 73 మంది మరణించారు. మృతుల్లో 14 మంది సైనికులు, పోలీసులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
21 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు చెప్పారు. బలూచిస్థాన్‌లోని మసాఖెల్ జిల్లాలో సోమవారం కొందరు ఉగ్రవాదులు ప్రధాన హైవేలపై బస్సులు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్లు తెలిపారు. వాహనాలను అడ్డగించి, ప్రయాణికులను కిందకు దింపి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది మరణించారు.
ఖలాత్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులు, ట్రక్కులను అడ్డుకొని, ప్రయాణికులను కిందకు దింపి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చేవారే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి వచ్చేవారు తమ వనరులను దోచుకుంటున్నారన్న ఆగ్రహంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మృతుల్లో అత్యధికులు దక్షిణ పంజాబ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మరికొందరు ఖైబర్ పఖ్తున్ఖ్వాకు చెందిన వారని తెలిపారు.
బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24, 25 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగినట్లు తెలిపారు. ముసాఖెల్ హైవేపై 35కు పైగా వాహనాలకు నిప్పు పెట్టినట్లు చెప్పారు. మరో ఘటనలో పాకిస్థాన్-ఇరాన్ మధ్యనున్న రైల్వే మార్గంలో క్వెట్టాను పాక్‌తో అనుసంధానించే వంతెనను మందుపాతరలతో ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మరణించినట్లు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.
మిలిటరీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులు కూడా చేశామని వెల్లడించింది. అయితే ఈ దాడులను అధికారులు ధ్రువీకరించలేదు. బలూచిస్థాన్‌లో జరిగిన వేర్వేరు దాడుల్లో మొత్తం 73 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బలూచిస్థాన్ ప్రావిన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
కాగా, బీఎల్‌ఏ దాడులను పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ, ప్రధాని షెహ్‌బాజ్ షరీ్‌ఫలు తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ప్రకటించారు. బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్టి కూడా.. ఈ దాడులను పిరికిపందల చర్యగా అభివర్ణించారు.
Updated Date - Aug 27 , 2024 | 05:15 AM