ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనడాలో హిందూ ఆలయంపై దాడి

ABN, Publish Date - Nov 05 , 2024 | 03:30 AM

కెనడాలో ఖలిస్థానీలు మరోసారి హిందువుల ఆలయంపై దాడికి తెగబడ్డారు. టొరొంటోకు సమీపంలోని బ్రాంప్టన్‌ నగరంలో ఉన్న హిందూ సభ మందిరం వద్ద ఆదివారం విధ్వంసం సృష్టించారు.

  • భక్తులపైన కూడా.. ఖలిస్థానీల ఆగడం

  • కాన్సులర్‌ క్యాంపు వద్దా విధ్వంసం

  • ఒక్కరినీ అరెస్టు చేయని పోలీసులు

  • ఘటనను ఖండించిన మోదీ, జస్టిన్‌ ట్రూడో

ఒట్టావా/న్యూఢిల్లీ, నవంబరు 4: కెనడాలో ఖలిస్థానీలు మరోసారి హిందువుల ఆలయంపై దాడికి తెగబడ్డారు. టొరొంటోకు సమీపంలోని బ్రాంప్టన్‌ నగరంలో ఉన్న హిందూ సభ మందిరం వద్ద ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఆలయానికి వచ్చిన భక్తులపై దాడి చేశారు. భారతీయుల కోసం కాన్సులర్‌ సేవలు అందించేందుకు ఆలయ ఆవరణలో స్థానికుల సహకారంతో భారత హైకమిషనర్‌ కార్యాలయం నిర్వహిస్తున్న కాన్సులర్‌ క్యాంప్‌పైనా ఖలిస్థానీలు దాడి చేశారు. అయితే, ఆ క్యాంపు వద్ద నియమించిన పోలీసులు ఇప్పటి వరకూ నిందితులెవరినీ గుర్తించలేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిందితులు ఖలిస్థానీ జెండాలతో అక్కడికి రావడం, భారత జెండాలు పట్టుకున్నవారితో ఘర్షణకు దిగడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ముష్టిఘాతాలు కురిపించడం, కొందరి చేతుల్లో కర్రలున్న దృశ్యాలు కూడా వీడియోల్లో కనిపించాయి.

దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలనే డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఒట్టావాలోని భారత హై కమిషనర్‌ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాన్సులర్‌ క్యాంప్‌నకు హాజరైన దరఖాస్తుదారుల భద్రతపైనా తాము ఆందోళన చెందామని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత వ్యతిరేక శక్తులు విధ్వంసం సృష్టించినప్పటికీ ఆ క్యాంపులో వెయ్యి మందికి లైఫ్‌ సర్టిఫికెట్లు జారీ చేశామని తెలిపింది. దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇది కెనడాలోని భారత దౌత్యవేత్తలను భయపట్టడానికి పిరికిపందలు చేసిన ప్రయత్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘భారత సంకల్పాన్ని ఇలాంటి హింసాత్మక చర్యలు బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్ట పాలనను అమలు చేస్తుందని మేం ఆశిస్తున్నాం’ అని ‘ఎక్స్‌’లో మోదీ పోస్టు చేశారు.


అది తీవ్రవాదులు, వేర్పాటువాదులు చేసిన దాడిగా భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ అభివర్ణించారు. ‘ఇలాంటి ఘటనలు జరుగకుండా అన్ని ప్రార్థనాలయాలకూ రక్షణ కల్పించాలని కెనడా ప్రభుత్వానికి మేం పిలుపునిస్తున్నాం. హింసకు పాల్పడినవారిని ప్రాసిక్యూట్‌ చేస్తారని కూడా మేం ఆశిస్తున్నాం. కెనడాలోని భారతీయుల భద్రత విషయంలో మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం’ అని జైశ్వాల్‌ పేర్కొన్నారు. ఘటనను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ప్రతిపక్ష నేత పియెరీ పొలివ్రే కూడా ఖండించారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ‘ఎక్స్‌’లో ట్రూడో పేర్కొన్నారు. కాగా, కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదుల ముప్పు పెరుగుతోందని ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కెనడాలోని రాజకీయ, చట్ట వ్యవస్థలను కూడా ఖలిస్థానీ తీవ్రవాదులు ప్రభావితం చేస్తున్నారని నిందించారు. ‘ఈరోజు ఖలిస్థానీ తీవ్రవాదులు రెడ్‌లైన్‌ను కూడా దాటేశారు’ అని ఆక్షేపించారు. ఘటనను ఆంటారియో సిక్స్‌ అండ్‌ గురుద్వారా కౌన్సిల్‌ కూడా ఖండించింది. ఘటనపై విచారణ జరపాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేసింది.


  • భక్తులపై పోలీసుల దాడి వీడియో వైరల్‌..

కెనడాలో హిందూ భక్తులపై కెనడా పోలీసులు దాడి చేసిన వీడియోను కెనడా జర్నలిస్టు ఒకరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆలయానికి వెళ్తున్న హిందువులపై పోలీసులు దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల్లో చాలామంది చేతుల్లో భారత జెండా ఉంది. దీపావళి రోజు ఆలయాలకు వెళ్తున్న భక్తులను ఖలిస్థానీలు వేధించడాన్ని నిరసిస్తూ హిందువులు ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఒక నిరసనకారుడిని ఒక పోలీసు అనేకసార్లు కొట్టిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ‘అతను లాఠీతో కొడుతున్నాడు’ అంటూ వీడియోను చిత్రీకరించిన మహిళ మాట్లాడటం, ‘అతన్ని బయటికి తీసుకెళ్లండి’ అని నిరసనకారులు చేసిన నినాదాలు వీడియోలో వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 05 , 2024 | 03:32 AM