Govt Jobs: సంచలన నిర్ణయం.. లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు
ABN, Publish Date - Sep 30 , 2024 | 09:03 AM
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.
దివాళా దిశగా పాక్..
2023లో పాకిస్థాన్ దివాలాకు చేరువైనప్పటికీ.. ఐఎంఎఫ్ ద్వారా మూడు బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. అయితే ఇదే చివరిసారి అంటూ.. దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్‌తో కొంతకాలంగా చర్చలు జరిపింది. ప్యాకేజీ విషయంలో సెప్టెంబరు 26న ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. పన్ను- జీడీపీ నిష్పత్తిని పెంచడం, ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలపై పన్ను, రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు ఐఎంఎఫ్‌కు పాక్ హామీ ఇచ్చింది. దీంతో ఐఎంఎఫ్ తొలి విడత ఒక బిలియన్ డాలర్లను విడుదల చేసింది.
పటిష్ట విధానాలు అమలు చేస్తాం..
ఐఎంఎఫ్ ప్యాకేజీపై పాక్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... ‘‘ఐఎంఎఫ్ నుంచి ఇదే ప్రభుత్వ చివరి ప్యాకేజీ అని నిరూపించేలా మా విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలి. తద్వారా జీ20 కూటమిలో చేరడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా ఆరు మంత్రిత్వ శాఖలను తొలగిస్తున్నాం. రెండు మంత్రిత్వ శాఖలు వేరే దాంట్లో విలీనం కానున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల్లో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నాం. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 32 లక్షలకు పెరిగింది. గతంలో ఈ సంఖ్య 16 లక్షలుగా ఉండేది. పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను పటిష్టపరుస్తాం’’ అని ఆయన అన్నారు.
Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు
Tour Plans: లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్
For Latest News and National News click here
Updated Date - Sep 30 , 2024 | 09:03 AM