అమెరికా మాజీ అధ్యక్షుడు కార్టర్ మృతి
ABN, Publish Date - Dec 31 , 2024 | 03:31 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(100) అమెరికాలో జార్జియా రాష్ట్రంలోని ఆయన స్వస్థలం ప్లెయిన్స్ పట్టణంలో ఆదివారం తుది శ్వాస విడిచారు.
1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు
100 ఏళ్ల వయసులో తుదిశ్వాస
వాషింగ్టన్, న్యూఢిల్లీ, డిసెంబరు 30: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(100) అమెరికాలో జార్జియా రాష్ట్రంలోని ఆయన స్వస్థలం ప్లెయిన్స్ పట్టణంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో నిండు నూరేళ్లు పూర్తి చేసుకొన్నది ఆయనే. 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కార్టర్ ఆ సమయంలో భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు హరియాణా రాష్ట్రంలో ఆయన సందర్శించిన గ్రామానికి ఆయన పేరు(కార్టర్ పురి) పెట్టడం విశేషం. ఆయన మృతితో ప్రపంచం, అమెరికా ఒక అసాధారణ నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని కోల్పోయాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ కార్టర్ మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, ప్రపంచ శాంతికి విరామం లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. కార్టర్‌ను భారత స్నేహితుడిగా పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) ఎత్తివేశాక మన దేశానికి వచ్చిన తొలి అమెరికన్ అధ్యక్షుడు ఆయనే. అప్పుడు జనతా పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలో ఉంది. తన పర్యటనలో కార్టర్ మన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ... నిరంకుశ పాలన భారత్‌కు సరిపడదన్నారు. భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు బలపడడానికి కార్టర్ హయాంలో కృషి జరిగింది. ఒక రైతు, నర్సుల సంతానం అయిన కార్టర్ 1943లో అమెరికా నౌకాదళ కేడెట్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 1962లో సెనెటర్‌గా, 1970లో జార్జియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 1979లో ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య చరిత్రాత్మక క్యాంప్ డేవిడ్ శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. 1980లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అధ్యక్ష భవనాన్ని వీడాక ప్రపంచ శాంతి, పర్యావరణం, మానవ హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. దీంతో ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చి గౌరవించారు. జనవరి 9న వాషింగ్టన్‌లో అధికారిక లాంఛనాలతో కార్టర్‌అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు.
Updated Date - Dec 31 , 2024 | 03:31 AM