రష్యా రక్షణ బడ్జెట్ రూ.10.66 లక్షల కోట్లు!
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:15 AM
ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరులో పైచేయి సాధించడమే లక్ష్యంగా రష్యా తన రక్షణ రంగానికి బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది.
మాస్కో, డిసెంబరు 1 : ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరులో పైచేయి సాధించడమే లక్ష్యంగా రష్యా తన రక్షణ రంగానికి బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. రష్యా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి 13.5 ట్రిలియన్ రుబెల్స్.. భారత కరెన్సీలో రూ.10.66 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో రక్షణ రంగానికే దాదాపు 32.5 శాతం నిధులు కేటాయించడం విశేషం. 2024 రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది 28.3 శాతం అధికం. ఈ రూ.10.66 లక్షల కోట్ల బడ్జెట్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం కూడా తెలిపారు. కాగా, రష్యా.. ఉక్రెయిన్‌పై శనివారం జరిపిన క్షిపణి దాడిలో క్షతగాత్రుల సంఖ్య 24కు చేరింది. రష్యా సైన్యం ఆదివారం 78 డ్రోన్లుతో దాడి చేయగా వాటిలో 32 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని కెర్సన్ నగరంలో ఓ మినీ బస్సుపై ఆదివారం ఉదయం జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.
Updated Date - Dec 02 , 2024 | 03:15 AM