New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో తెలుగు సౌరభాలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 05:44 AM
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ తెలుగు సంప్రదాయాలు, సంస్కృతికి వేదికగా మారింది.
సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించిన టీఎల్‌సీఏ
న్యూయార్క్, సెప్టెంబరు 5: న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ తెలుగు సంప్రదాయాలు, సంస్కృతికి వేదికగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వం అమెరికా వాసులను ఆకట్టుకొంది. ఉత్తర అమెరికాలో గత 53 ఏళ్లుగా ఇండియన్-అమెరికన్ తెలుగు వారి వికాసానికి కృషి చేస్తున్న తెలుగు లిటరసీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టీఎల్‌సీఏ) సంస్థ వారాంతం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ సంస్థ టైమ్స్ స్క్వేర్‌లో సాంస్కృ తిక ఉత్సవాన్ని నిర్వహించడం ఇదే ప్రథమం.
యువతీయువకులు, మహిళలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి నృత్యం, కలంకారీ చిత్రాలు, కలంకారీ దుస్తులు, శిల్పాలు సహా 35 రకాల ప్రదర్శనలు ఇందులో ఉన్నాయి. టైమ్స్ స్క్వేర్‌కు వచ్చిన వారంతా వీటిని తిలకించారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కొత్త తరం వారికి తెలుగు భాష, సంస్కృతులపై అవగాహన కలిగించేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్టు టీఎల్‌సీఏ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి పర్వతాల చెప్పారు. న్యూయార్క్ సిటీ మేయర్ కార్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల విభాగం డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎల్‌సీఏ చేస్తున్న కృషిని అభినందించారు.
Updated Date - Sep 06 , 2024 | 05:44 AM