గ్రీన్ కార్డుదారులకు శుభవార్త
ABN, Publish Date - Sep 22 , 2024 | 04:16 AM
చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.
చెల్లుబాటు కాలాన్ని 36 నెలలకు పొడిగించిన యూఎస్
వాషింగ్టన్, సెప్టెంబరు 21: చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది. ఇది సెప్టెంబరు 10, 2024 నుంచి అమలులోకి వస్తుందని యూఎస్ ప్రకటించింది. ఇది గ్రీన్‌కార్డు దారులకు భారీగా ఊరట కలిగించే అంశం. చాలా వరకు గ్రీన్‌కార్డులు 10 సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తారు. షరతులతో కూడిన శాశ్వత నివాస గుర్తింపు అయితే రెండు సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తారు. ఆ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు లేక ముగిసిన వెంటనే గ్రీన్‌కార్డుదారు రెన్యువల్ కోసం ‘ఐ 90’ని దరఖాస్తు చేసుకోవాలి. సక్రమంగా ఈ దరఖాస్తును సమర్పించిన గ్రీన్‌కార్డుదారులందరికీ ఓ రశీదు జారీ చేస్తారు. ఆ రశీదు జారీ అయిన వారందరికీ మొన్నటి వరకూ ఆటోమేటిక్‌గా 24 నెలల అదనపు వాలిడిటీ లభించేది. ఇప్పుడు ఆ వాలిడిటీ కాలాన్ని 36 నెలలకు పొడిగించారు. ఈ రశీదు ఉన్నవారికి కొత్త గ్రీన్‌కార్డు వచ్చే వరకూ చట్టబద్ధ శాశ్వత నివాసదారునికి ఉండే అన్ని హక్కులూ సంక్రమిస్తాయి.
Updated Date - Sep 22 , 2024 | 04:16 AM