ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

President Elections : కమల గెలిస్తే చరిత్రే!

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:49 AM

హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది.

  • చివరి అంకం సర్వేల్లో హ్యారిస్‌ వైపే స్వల్పంగా మొగ్గు

  • స్వింగ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్న హోరాహోరీ

  • అయినా.. ఓటర్లు కమలవైపేనంటున్న సర్వేలు

  • ఆమె విజయావకాశాలు 50.015%

  • 49.985శాతానికి పడిపోయిన ట్రంప్‌

  • అమెరికా వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్‌

  • తొలిఫలితం.. ఆరు ఓట్లలో ఇద్దరికీ చెరిసగం

  • ఎన్నికలవ్వగానే కౌంటింగ్‌.. 7న పూర్తి ఫలితాలు

  • ట్రంప్‌ న్యాయపోరుకు 5 వేల మంది లాయర్లు

  • ఫలితాలు ప్రతికూలంగా వస్తే కోర్టుకెళ్లేందుకే

  • కమల గెలుపు కోసం తమిళనాట పూజలు

  • ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్లు

  • 9 మంది పోటీ.. మరోసారి బరిలో ఐదుగురు

  • వీరిలో ఆరుగురి గెలుపు నల్లేరుపై నడకే

అమెరికన్లు కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. నేను ఓ మహిళగా ఓట్లడగలేదు. అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని అని భావించినందుకే ఓట్లడిగాను.

- కమలాహ్యారిస్‌

అమెరికా చరిత్రలోనే ఇది గొప్ప రోజు. దేశాన్ని తిరిగి గొప్పగా నిలబెడతా. అది నా వల్లే సాధ్యం.

- ట్రంప్‌

న్యూయార్క్‌, నవంబరు 5: హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్‌ క్రతువు మంగళవారం రాత్రి 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు) పూర్తికానుంది. పోలింగ్‌ పూర్తవ్వగానే కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. అయితే.. ముందెన్నడూ లేనివిధంగా సర్వేల అంచనాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే.. డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోటీ కొనసాగింది.


తుది సర్వేల్లో మాత్రం కమల స్వల్పంగా ముందంజలో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే స్వింగ్‌ రాష్ట్రాల్లో గత నెలాఖరు వరకు కమల వైపు.. ఆ తర్వాత ట్రంప్‌ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్న సర్వేలు.. ఆదివారం అర్ధరాత్రి విడుదల చేసిన తాజా నివేదికల్లో కమల స్వల్ప ఆధిక్యాన్ని సాధిస్తారని తేల్చేశాయి. ఇక అమెరికా ఎన్నికల విషయంలో అభినవ నాస్ట్రడమ్‌సగా పేరున్న అలన్‌ లిచ్‌మన్‌ కూడా.. ఈ సారి కమలాహ్యారిస్‌ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. 1984 నుంచి ఆయన అంచనాలు 100ు నిజమవుతూ వస్తుండడం గమనార్హం..!

  • తొలి మహిళగా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల ఘనవిజయం సాధించి.. వైట్‌హౌ్‌సకు వెళ్తే.. అదో చరిత్ర అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె నిలిచిపోతారంటున్నారు. అంతేకాదు.. ఆఫ్రికా-ఆసియా సంతతికి చెందిన తొలి మహిళా అధ్యక్షురాలు కూడా ఆమేనని వివరిస్తున్నారు. గత నెలాఖరు వరకు సింహభాగం సర్వేలు కమల వైపే ఉండగా.. ఈనెల 1-3 తేదీల్లో మాత్రం స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ గాలి వీస్తోందని వెల్లడించాయి. సోమవారం అర్ధరాత్రి విడుదలైన తాజా సర్వేల్లో కమల అనూహ్యంగా పుంజుకున్నారు. పోలింగ్‌ గురు నేట్‌ సిల్వర్‌కు చెందిన ఫైవ్‌థర్టీఎయిట్‌ తుది సర్వే ఫలితాల్లో స్వింగ్‌ రాష్ట్రాల్లో కమల పుంజుకున్నారని, అయితే.. అంచనాలు క్లిష్టంగా ఉన్నాయని వెల్లడైంది. అయితే.. కమల విజయావకాశాలు 50.015శాతంగా ఉన్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో ట్రంప్‌ విజయావకాశాలు 49.985శాతానికి దిగజారాయని.. పోటీ మాత్రం హోరాహోరీగా ఉందని పేర్కొంది. తటస్థ ఓటర్లే విజేతల నిర్ణేతలని అభిప్రాయపడింది. పీబీఎస్‌ న్యూస్‌-ఎన్‌పీఆర్‌-మారిస్ట్‌ సర్వే కూడా కమల 51% విజయావకాశాలతో ముందంజలో ఉన్నట్లు తెలిపింది. ది హ్యారిస్‌ ఎక్స్‌-ఫోర్బ్స్‌ నిర్వహించిన సర్వేలో కమల ముందంజలో ఉన్నట్లు తేలింది. ఆమెకు 49%, ట్రంప్‌నకు 48% మంది మద్దతు తెలిపినట్లు వివరించింది. యాహూ న్యూస్‌-యూగావ్‌ కూడా ఇరువురికి చెరో 47% చొప్పున విజయావకాశాలివ్వగా.. మార్నింగ్‌ కన్సల్ట్‌, ఎకానమి్‌స్ట-యూగావ్‌ సర్వేలు కమలకు 49%, ట్రంప్‌నకు 46% మంది మద్దతున్నట్లు వెల్లడించాయి. రియల్‌క్లియర్‌ పోలింగ్‌ సర్వే మాత్రం ట్రంప్‌ 219 స్థానాల్లో.. కమల 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారని పేర్కొంది.


  • తెల్లవారుజామునే పోలింగ్‌ షురూ

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఆయా రాష్ట్రాల నైసర్గిక స్వరూపం, ఆరు కాలమానాల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ప్రారంభమైంది. అమెరికాలో హవాయి, అలస్కా, పసిఫిక్‌, మౌంటైన్‌, సెంట్రల్‌, ఈస్టర్న్‌ అనే ఆరు కాలమానాలున్నాయి. వీటిల్లో హవాయి-ఈస్టర్న్‌ కాలమానాల మధ్య వ్యత్యాసం 5 గంటలు. కొన్ని రాష్ట్రాల్లో తెల్లవారుజామున 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. అక్కడి ఓటర్లు 4 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో పోలింగ్‌ మొదలైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనగా.. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • ఫలితాలు ఎప్పుడు?

అమెరికాలో పోలింగ్‌ సమయం పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. భారత్‌ మాదిరిగా అమెరికాలో ఏకకేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉండదు. రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఎన్నికల ఏజెన్సీలుంటాయి. దీంతో.. లెక్కింపులో కొన్ని చోట్ల ఆలస్యం జరగడం సాధారణమే. మంగళవారం అర్ధరాత్రికి సింహభాగం రాష్ట్రాల్లో ఫలితాలు తేలిపోతాయి. అయితే.. కొన్ని రాష్ట్రాల ఫలితాలకు బుధవారం మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని అంచనా. అంతేకాదు.. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక.. మెయిల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే మిలటరీ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి. దాంతో.. ఈ నెల 7 వరకు ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. అమెరికాలో 24.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ముందస్తు ఓటింగ్‌లో 8.2 కోట్ల మంది వినియోగించుకున్నారు.


  • ట్రంప్‌ న్యాయపోరాటానికి.. 5 వేల మంది లాయర్లు

2020 మాదిరిగా ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే.. న్యాయపోరాటం చేయాలని ట్రంప్‌ నిర్ణయించారు. అప్పట్లో ఆయన బైడెన్‌ ఎన్నిక చెల్లదని, తాను అధికార పీఠం నుంచి దిగేది లేదని భీష్మించుకున్నారు. అయితే.. న్యాయస్థానంలో సరైన ఆధారాలు లేనందున.. జడ్జి ఆయన వ్యాజ్యాన్ని కొట్టివేశారు. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు 5 వేల మంది న్యాయవాదులను ట్రంప్‌ నియమించుకున్నారు.

  • కమలా హ్యారిస్‌ గెలుపుకోసం తమిళనాట పూజలు

చెన్నై, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కమలాహ్యారిస్‌ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఆమె పూర్వీకుల స్వస్థలమైన తమిళనాడులోని తిరువారూరు జిల్లా తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరిలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. కమలాహ్యారిస్‌ ఫోటోలు ముద్రించిన పోస్టర్లను ఊరంతా అతికించి సందడి చేశారు. కమల తల్లి వైపు తాతముత్తాతలంతా తులసేంద్రపురానికి చెందినవారు. ఈ కారణంగానే అక్కడి ధర్మశాస్తా ఆలయంలో గత రెండు రోజులుగా కమలా హ్యారిస్‌ అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటూ గ్రామస్థులు ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిపారు. మదురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో కమల గెలుపును కాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


  • తొలి ఫలితం 50:50

కేవలం ఆరుగురు ఓటర్లున్న న్యూహ్యాం్‌పషైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో మంగళవారం ఉదయమే ఫలితం విడుదలైంది. అమెరికా-కెనడా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో.. అర్ధరాత్రి దాటగానే పోలింగ్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఓటర్లలో ముగ్గురు కమలకు.. మరో ముగ్గురు ట్రంప్‌నకు జైకొట్టారు. 2020లో మాత్రం వీరంతా డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌కు ఓటేశారు. నిజానికి ఈ ప్రాంతంలో ఉన్న ఆరుగురు ఓటర్లలో నలుగురు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులుగా నమోదు చేసుకున్నారు. మరో ఇద్దరు ఏ పార్టీ తరఫున లేనట్లు చెప్పారు. అయితే.. ట్రంప్‌ మద్దతున్న నలుగురిలో ఒకరు క్రాస్‌ ఓటింగ్‌ వేసినట్లు ఇక్కడి ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఇలా చివరి నిమిషంలో మనసు మార్చుకునే ఓటర్ల వల్ల తమకే లబ్ధి చెందుతుందని కమల మద్దతుదారులు భావిస్తున్నారు.

  • మంగళవారమే ఎందుకు?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడిచిన 170 సంవత్సరాలుగా మంగళవారాల్లోనే జరుగుతుంటాయి. ఇందుకు కారణాలున్నాయి. 1845కు ముందు వరకు కూడా రాష్ట్రాలు వేర్వేరుగా.. వేర్వేరు రోజుల్లో ఎన్నికలను నిర్వహించేవి. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతుండడంతో.. 1845 నుంచి నవంబరు నెలలో మొదటి మంగళవారం(ఒకటో తేదీ అయ్యి ఉండకూడదు. ఒకవేళ ఒకటో తేదీ మంగళవారం అయితే.. మొదటి సోమవారం తర్వాతి రోజు నిర్వహిస్తారు) దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1792 నాటి ఫెడరల్‌ చట్టాన్ని సవరించారు. 1845లో చట్టసవరణ జరిగిన నాటికి అమెరికా ఓ వ్యవసాయ దేశం. నవంబరు కల్లా పంటచేతికి వచ్చి, రైతులు ఖాళీగా ఉండే సమయం కావడంతో.. ఈ నెలలో పోలింగ్‌ను నిర్వహించాలనే సంప్రదాయాన్ని పరిచయం చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో మంగళవారాల్లో కాకుండా.. వారాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

Updated Date - Nov 06 , 2024 | 03:55 AM