Moscow Attacks: అసలు ISIS-K ఏంటి.. రష్యాని ఎందుకు టార్గెట్ చేసింది?
ABN, Publish Date - Mar 23 , 2024 | 04:16 PM
రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) భీకర ఉగ్రదాడి (Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ముష్కరులు దూసుకొచ్చి కాల్పులు జరపడంతో.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్.. ముఖ్యంగా ISIS-K అని పిలువబడే బ్రాంచ్ ప్రకటించింది.
రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) భీకర ఉగ్రదాడి (Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ముష్కరులు దూసుకొచ్చి కాల్పులు జరపడంతో.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్.. ముఖ్యంగా ISIS-K అని పిలువబడే బ్రాంచ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే.. ISIS-K అంటే ఏమిటి? ఈ ఉగ్ర సంస్థ ఎందుకు రష్యాను టార్గెట్ చేసింది? అనేది చర్చనీయాంశంగా మారింది. పదండి.. ఆ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
ISIS-K చరిత్ర
ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ISIS-K) అనేది 2014లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్‌కి అనుబంధంగా ఉంది. ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసే చారిత్రక ప్రాంతం పేరుని ఈ ఉగ్రసంస్థకు పెట్టారు. ఈ ISIS-K ఎన్నో క్రూరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి, అపఖ్యాతిని మూటగట్టుకుంది. తాలిబన్, యుఎస్ దళాల సమిష్టి ప్రయత్నాల కారణంగా.. 2018 నుంచి దీని బలం క్షీణించింది. అయినప్పటికీ.. ఆ ప్రాంతంలో ఈ సమూహం పెద్ద ముప్పుగానే ఉంది.
రష్యాని ఎందుకు టార్గెట్ చేసింది?
రష్యాను ISIS-K టార్గెట్ చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. మిడిల్ ఈస్ట్‌లో, ముఖ్యంగా సిరియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక జోక్యంతో ముడిపడి ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ పాలనకు మద్దతివ్వడానికి పుతిన్ తన రష్యన్ దళాలను సిరియాకు పంపించాడు. అస్సాద్ తన అధికారంపై పట్టు సాధించేందుకు గాను ISIS, ఇతర తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనికి పుతిన్ మద్దతు ఇవ్వడమే.. రష్యాను ISIS-K టార్గెట్ చేసుకోవడానికి దోహదపడి ఉండొచ్చు.
అంతేకాదు.. ఈ ఉగ్ర సంస్థ రష్యాను ముస్లింలను అణచివేసే దేశంగా చూస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందునా.. ఈ ఉగ్ర సంస్థలో ఉన్న మిలిటెంట్లలో చాలామంది ఆసియా నుంచి వచ్చిన వారున్నారు. వీళ్లు ఎప్పటి నుంచో రష్యాని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ ద్వేషంతోనే వాళ్లు రష్యా గడ్డపై ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గతంలో ఈ ఉగ్ర సంస్థ ఆఫ్ఘనిస్తాన్, దాని చుట్టుపక్కల అనేక దాడులు చేసింది. 2021లో కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంస్థ చేసిన భీకర దాడి యావత్ ప్రపంచాన్ని వణికించింది.
మాస్కో దాడిపై అమెరికా
ఇదిలావుండగా. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై తాము గతంలోనే రష్యాను హెచ్చరించామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. మాస్కోలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రదాడి జరిగే అవకాశముందని నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని.. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలను లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని తెలిసిందని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆడ్రియన్నీ వాట్సన్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యా అధికారులతో వెంటనే పంచుకున్నామన్నారు.
ప్రధాని మోదీ
మాస్కోలో జరిగిన ఈ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్రంగా ఖండించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని, క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పుకొచ్చారు.
Updated Date - Mar 23 , 2024 | 04:16 PM