3D Printed Guns: అమెరికాకు ‘ఘోస్ట్ గన్స్’ తలనొప్పి!
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:09 AM
తుపాకుల సంస్కృతి అమెరికాకు కొత్త కాదు! తరచుగా ఎక్కడో ఒకచోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉంటాయి.
పెరిగిపోతున్న త్రీడీ ముద్రిత తుపాకుల సంస్కృతి
తుపాకుల సంస్కృతి అమెరికాకు కొత్త కాదు! తరచుగా ఎక్కడో ఒకచోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేశాన్నే ఇప్పుడు ‘త్రీడీ ప్రింటెడ్’ తుపాకుల విస్తృతి తీవ్రంగా భయపెడుతోంది. చూడ్డానికి పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉండే ఈ తుపాకులు అగ్రరాజ్యానికి తలనొప్పిగా మారాయి. ఉదాహరణకు.. ఈ నెల 4వ తేదీన అమెరికాలో యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్.. కాల్పుల్లో చనిపోయారు గుర్తుంది కదా! ఆ హత్యకు నిందితుడు వాడింది త్రీడీ ప్రింటెడ్ తుపాకీనే. అదొక్కటే కాదు.. ఇటీవలికాలంలో అమెరికాలో జరిగిన పలు హై-ప్రొఫైల్ నేరాల్లో నిందితులు ఇంట్లోనే త్రీడీ ప్రింటర్ల సాయంతో ముద్రించిన ఆయుధాలను వాడినట్టు తేలడం పోలీసులను కలవరపెడుతోంది. దుకాణంలో కొన్న తుపాకులకు ఒక లెక్కాపత్రం ఉంటాయి! ఇంట్లో త్రీడీ ప్రింటర్ పెట్టి దాంట్లో ఆయుధాలను/తుపాకులను ముద్రించి నేరాలకు పాల్పడితే వాటిని గుర్తించడం కూడా కష్టమే కదా! అందుకే ఈ తుపాకులను అమెరికా పోలీసులు ‘ఘోస్ట్ గన్స్’గా వ్యవహరిస్తున్నారు. చాలా కేసుల్లో ఘోస్ట్ గన్స్ వాడినట్టు తేలడంతో అమెరికా సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యపై దృష్టి సారించింది.
ఈ సమస్య ఒక్క అమెరికాకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఉంది. నిజానికి త్రీడీ ముద్రిత తుపాకీకి సంబంధించి ప్రపంచంలో తొలి క్రిమినల్ కేసు యూకేలో 2013లో నమోదైంది. అప్పటి నుంచి యూర్‌పలోని వ్యవస్థీకృత నేర ముఠాల నుంచి మయన్మార్‌లో తిరుగుబాటుదారుల దాకా.. జిహాదీలు, వామపక్ష తీవ్రవాదులు, మితవాదులు, జాతిపరమైన వేర్పాటువాదులు.. ఇలా అందరి దృష్టీ వీటిపైకి మళ్లింది. యూర్‌పలో 2013-2024 నడుమ త్రీడీ ప్రింటెడ్ ఆయుధాలకు సంబంధించి 165 కేసులు నమోదయ్యాయి. అందులో 15ు కేసులు ఉగ్రవాదానికి సంబంధించినవి. తుపాకులు కలిగి ఉండడం చట్టబద్ధమైన అమెరికాలో అయితే.. వీటి వినియోగం ఆందోళనకరస్థాయికి పెరిగిపోయింది. యూఎస్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ గణాంకాల ప్రకారం.. 2017-21 నడుమ అక్కడి దర్యాప్తు సంస్థలు 38 వేల ఘోస్ట్ గన్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా త్రీడీ ముద్రిత తుపాకులకు సంబంధించి అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లోఅన్ని దేశాల్లో కలిపి ఈ తరహా కేసుల్లో 66 మంది అరెస్టయ్యారు.
ఎందుకు ప్రమాదం?
చట్టబద్ధంగా ఎవరైనా తుపాకీ కొంటే.. దాని సీరియల్ నంబర్, ఎవరు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? లాంటి వివరాలన్నీ అధికారుల డేటాబే్‌సలో ఉంటాయి. కాల్పుల ఘటనలు జరిగినప్పుడు కొద్దిపాటి దర్యాప్తుతో నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరికివారు ఇంట్లో ప్రింటర్ పెట్టి ప్రింటవుట్ తీసినంత సులభంగా ఆయుధాలు ముద్రించేసుకుంటే వాటిని గుర్తించడం పోలీసులకు అసాధ్యం అవుతుంది. ఈ ముప్పును గుర్తించే జపాన్, కెనడా, యూరోపియన్ దేశాలు త్రీడీ ప్రింటెడ్ తుపాకులపై నిషేధం విధించాయి.
Updated Date - Dec 21 , 2024 | 04:09 AM