వృద్ధులకు 5లక్షల ఆరోగ్య బీమా
ABN, Publish Date - Oct 30 , 2024 | 06:04 AM
దేశవ్యాప్తంగా 70ఏళ్ల వయసు దాటిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 70ఏళ్లు దాటిన వారందరికీ అందుబాటులోకి
న్యూఢిల్లీ, అక్టోబరు 29: దేశవ్యాప్తంగా 70ఏళ్ల వయసు దాటిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఆరోగ్య రంగంలో రూ.12,850 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులతో పాటు గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ-విన్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాజా పథకం ద్వారా దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాల్లోని 6కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. పేద, ధనిక భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికి కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్నవారికి మరో రూ..5లక్షల అదనపు టాప్-ఆప్ కవరేజీ లభిస్తుంది. (ఈ మొత్తాన్ని వారు కుటుంబంలో 70ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇతర సభ్యులతో పంచుకోవాల్సిన అవసరం లేదు.). ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, ఈఎ్‌సఐసీ కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. సీజీహెచ్‌ఎస్, ఎక్స్-సర్వీ్‌సమన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్ముడ్ రిజర్వు పోలీసు ఫోర్స్ పథకాల్లో ఉన్న వృద్ధులు వాటిని గానీ ఏబీ-పీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. దీనికోసం పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కాగా, ఆయుష్ రంగ విస్తరణలో భాగంగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద రెండో దశను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. దీనిలో అత్యాధునిక పంచకర్మ ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మసీ, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, ఐటీ, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్ల ఆడిటోరియంను నిర్మిస్తారు. ఇండోర్‌లో నూతన ఈఎ్‌సఐసీ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు ఫరీదాబాద్(హరియాణా), బొమ్మసంద్ర, నరసాపూర్(కర్ణాటక), మీరట్(ఉత్తర ప్రదేశ్), అచ్యుతాపురం(ఏపీ), ఇండోర్‌లలో ఆదనపు ఈఎ్‌సఐసీ ఆసుపత్రులక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ఎయిమ్స్ రుషీకేశ్, బీబీనగర్, గువాహటి, భోపాల్, జోధ్‌పూర్ సహా 11 ప్రధాన సంస్థల్లో డ్రోన్ ఆధారిత సేవలను ప్రధాని ప్రవేశపెట్టారు. అలాగే ఎయిమ్స్ రిషీకేశ్‌లో హెలికాప్టర్ అత్యవసర వైద్యసేవలను ప్రారంభించనున్నారు.
అచ్యుతాపురం సెజ్‌లో ఈఎ్‌సఐ ఆస్పత్రి
అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా), అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాట్లాడుతూ.. ఈఎ్‌సఐ ఆస్పత్రిని కేంద్రం గతంలోనే మంజూరు చేసిందని, కానీ జగన్ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టలేదని విమర్శించారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు.
యువత ఉపాధికి ప్రత్యేక వ్యవస్థ
దేశంలో ప్రతి యువకుడు/యువతికి ఉపాధి కల్పించే సరికొత్త ప్రత్యేక వ్యవస్థను సృష్టిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. యవతకు గరిష్ఠ సంఖ్యలో ఉద్యోగాలు సమకూర్చాలన్నది తన ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’లో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022లో ఈ మేళా పథకాన్ని ప్రారంభించామని.. రెండేళ్లలోనే ఇప్పటివరకు 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణలో లక్షన్నర స్టార్ట్‌పలు ప్రారంభించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కోటి మంది యువతను చేర్చుకోవడానికి పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం చేపట్టామని ప్రస్తావించారు. ప్రధాని ఈ సందర్భంగా ప్రజలకు ధన త్రయోదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ దీపావళి పర్వదినం ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత అయోధ్య దివ్య దేవాలయంలో శ్రీరాముడిని ప్రతిష్ఠించిన తొలి సంవత్సరమిది’ అని వ్యాఖ్యానించారు.
Updated Date - Oct 30 , 2024 | 06:04 AM