కెనడా వద్దంటోంది..
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:43 AM
తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకం
వచ్చే ఏడాదితో ముగియనున్న పర్మిట్ల గడువు
విద్యార్థులు గడువు పెంచుకునేందుకు చాన్స్
న్యూఢిల్లీ, డిసెంబరు 2: తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వలస విధానంలో కొత్త పాలసీలు తీసుకొచ్చిన నేపథ్యంలో వారిని దేశంలో కొనసాగనిస్తారా? లేదా.. అవన్నీ రద్దవుతాయా? అనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఆఖరుకు సుమారు 50 లక్షల తాత్కాలిక పర్మిట్లకు గడువు తీరిపోతోంది. ఇందులో వర్క్ పర్మిట్‌పై, స్టడీ పర్మిట్‌పై ఉన్న వారితో పాటు శరణార్థులు కూడా ఉన్నారు. కెనడా ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ మళ్లీ పర్మిట్లు కొనసాగించే పరిస్థితి కనిపించడంలేదు. వలస వచ్చిన వారు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోతారని కెనడా ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇదే విషయాన్ని కామన్ ఇమిగ్రేషన్ కమిటీ సమావేశంలో ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ కూడా తెలిపారు. గత వారం జరిగిన ఆ సమావేశంలో కన్జర్వేటివ్ ఎంపీ టామ్ కిమియెక్ ఈ అంశాన్ని లేవనెత్తారు.
తాత్కాలిక పర్మిట్స్‌పై ఉన్న సుమారు 49 లక్షల మందిని అవసరమైతే దేశం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆ ఎంపీ ప్రశ్నించారు. దీనికి మార్క్ మిల్లర్ సమాధానమిస్తూ.. కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎ్‌సఏ) వలస చట్టాలను అమలు చేయడంలో చురుకుగా పనిచేస్తోందని, అయినా చాలా మంది స్వచ్ఛందంగానే దేశాన్ని వదిలి వెళ్లిపోతారని భావిస్తున్నామని తెలిపారు. అలాగే స్టూడెంట్ వీసాపై ఉన్న సుమారు 7.66 లక్షల మందికి డిసెంబర్ 2025తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారిని సీబీఎ్‌సఏ ట్రాక్ చేస్తుందా అన్న ప్రశ్నకు కూడా మార్క్ మిల్లర్ జవాబిచ్చారు. కొంత మంది విద్యార్థులు వారి పర్మిట్స్‌ను పునరుద్ధరించుకుంటారని లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారని ఇలా చేయడం వల్ల వారి పర్మిట్ల గడువును పెంచుకునే అవకాశం ఉందన్నారు. దీనికి సబంధించిన ఓ వీడియోను కెనడా మీడియా సంస్థ నేషనల్ పోస్టులో ఆయన షేర్ చేశారు.
భారతీయులకే ఇబ్బంది ఎక్కువ?
దేశంలో మౌలిక వసతులు తగ్గిపోతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల ముందు ట్రూడో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా తీసుకుంటున్న శాశ్వత, తాత్కాలిక రెసిడెంట్స్ సంఖ్యను వచ్చే మూడేళ్లలో గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. దీని కోసం కొత్త పాలసీలు ప్రవేశపెట్టింది. ఇది భారతీయులకు పెద్ద ఇబ్బందిగానే భావిస్తున్నారు. ఎందుకంటే కెనడాకు వలసల్లో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. శాశ్వత రెసిడెంట్స్‌లో 2022లో మొత్తం భారతీయులు 27 శాతం ఉన్నారు. అయితే తాత్కాలికంగా పర్మిట్లు పొందిన వారిలో భారత జాతీయులు ఎంతమంది అనేది స్పష్టంగా లెక్కలు లేవు. పర్మినెంట్ రెసిడెంట్స్‌కు పర్మిట్లను 2025 కల్లా 5 లక్షల నుంచి 3.95 లక్షలకు తగ్గించాలని కెనడా ఇమిగ్రేషన్ కొత్త పాలసీలో పేర్కొన్నారు. ఇది 21 శాతం తగ్గుదల.
కాగా తాత్కాలిక వర్కర్స్, స్టూడెంట్స్ విషయంలో కూడా పర్మిట్లను భారీగా తగ్గించనున్నారు. 2026 కల్లా తాత్కాలిక విదేశీ వర్కర్ల సంఖ్యలో 40 శాతం, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 10 శాతం కోత పడుతుందని భావిస్తున్నారు. కొత్త పాలసీ వల్ల దేశంలో జనాభాను నియంత్రించడమే కాకుండా, ఇళ్ల నిర్మాణం, హెల్త్ కేర్, ఇతర సేవలపై ప్రభుత్వ ఖర్చు పెంచే అవకాశం ఉంటుందని కెనడా అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దేశంలో ఖర్చులన్నీ పెరిగిపోయిన కారణంగా కెనడాకు వలసపై భారతీయుల పునరాలోచించుకోవాలని ఇమిగ్రేషన్ విశ్లేషకుడు దర్శన్ మహారాజ్ సూచించారు. కెనడాకు వద్దామనుకునే భారతీయులు వేరే దేశంలో అవకాశాలు చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
Updated Date - Dec 03 , 2024 | 04:43 AM