National Politics : జాతీయంలో స్థానికం
ABN, Publish Date - May 18 , 2024 | 05:18 AM
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా..
ఢిల్లీలో 52 చిన్నపార్టీల నుంచి అభ్యర్థులు
జాతీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పి
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా.. ఢిల్లీలో ఇలాంటి చిన్నాచితక 52 పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. మూడు జాతీయ పార్టీలకు చెందిన, పలుసార్లు ఎంపీలుగా నెగ్గిన బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ అభ్యర్థులకు వీరంతా చెవిలో జోరీగలా మారారు. వీటి తరఫున పోటీకి నిలిచినవారిలో కార్మికులు, మత గురువులు, జర్నలిస్టులు, లాయర్లు వంటి విభిన్న రంగాలకు చెందినవారు ఉన్నారు. అంజన్ ఆద్మీ, ఆప్కీ అప్నీ, గరీబ్ ఆద్మీ వంటి పార్టీలు రాష్ట్రంలో అధికార ఆప్ పేరును పోలి ఉన్నాయి. 1.52 కోట్ల మంది ఓటర్లున్న హస్తినలో ఏడు లోక్ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది.
గెలుపు ముఖ్యం కాదు..
అనామక పార్టీల నుంచి అభ్యర్థులుగా నిలిచినవారిలో ఎక్కువమంది తమ విజయం కంటే మూడు ప్రధాన పార్టీలకు చెందిన ఓట్లను సాధ్యమైనంతగా చీల్చాలని భావిస్తున్నారు. వాయువ్య ఢిల్లీ నుంచి వోటర్స్ పార్టీ తరఫున పోటీకి దిగిన నందారామ్ బగ్రీ (71) తన చేతిలో ఉన్న నగదు రూ.వెయ్యి మాత్రమే అని అఫిడవిట్‌లో చూపారు. ఈ నియోజకవర్గం అభ్యర్థుల్లో ఈయనొక్కరే నిరక్షరాస్యుడు.
‘‘ఉచిత విద్యుత్తు, ఉచిత కరెంటు, ఖాతాల్లో రూ.15 లక్షల జమ వంటి ప్రధాన పార్టీలు ఇస్తున్న హామీలను మేం ఎప్పుడో ఇచ్చాం. మా నుంచే ఆ పార్టీలు కాపీ కొట్టాయి’’ అని బగ్రీ పేర్కొంటున్నారు. యోగేందర్ చందోలియా (బీజేపీ), ఉదిత్ రాజ్ (కాంగ్రె్‌స)లను ఈయన సవాల్ చేస్తున్నారు. కాగా, ఒంటరి మహిళ సీమా రిజ్వీ (41) చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున బరిలో నిలిచారు.
చాందినీ చౌక్‌లో కాంగ్రెస్ తరఫున మూడుసార్లు గెలిచిన జేపీ అగర్వాల్ పోటీకి దిగారు. వ్యాపారవేత్త ప్రవీణ్ ఖండేల్వాల్‌ను బీజేపీ టికెట్ ఇచ్చింది. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టు రమే్‌షకుమార్ జైన్ (గరీబ్ ఆద్మీ పార్టీ)ది మరో ప్రత్యేకత.
ఈయన తనకు ఓటు వేయాలని అడగడం లేదు. దాని బదులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. కాగా, గత రెండు ఎన్నికల్లోనూ ఢిల్లీలోని ఏడు స్థానాలనూ బీజేపీనే గెలుచుకుంది. ఈసారి ఇండియా కూటమిలో భాగంగా ఆప్ 4, కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్థులను దించాయి.
Updated Date - May 18 , 2024 | 05:47 AM