‘మహా’ సంకటం
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:57 AM
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేతే అవుతారని ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ చెప్పారు.
ముహూర్తం ఖరారైనా మహా కొత్త సీఎంపై వీడని సందిగ్ధత
డిసెంబరు 5 సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రమాణం
బీజేపీ నుంచే కొత్త సీఎం ఉంటారన్న అజిత్ పవార్
ముంబై, నవంబరు30: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేతే అవుతారని ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ చెప్పారు. శివసేనతో పాటు తన పార్టీ నుంచి డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలిపారు. అయితే ఇంకా మంత్రిత్వ శాఖల కేటాయింపులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడం మహారాష్ట్రలో కొత్తకాదన్నారు. 1999లో నెల రోజుల సమయం పట్టిందని అజిత్ పవార్ గుర్తు చేశారు. నవంబరు 23న ఫలితాలు రాగానే బీజేపీ సీఎంగా దేవేంద్ర ఫడణవీ్‌సకు అజిత్ పవార్ మద్దతు పలికారు. డిసెంబరు 5న సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుతీరబోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవ్‌నకులే తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆయన వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనేది మాత్రం చంద్రశేఖర్ వెల్లడించలేదు. మరోవైపు, ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో మహాయుతి నేతల సమావేశం తర్వాత ముంబై నుంచి తన సొంతూరు సతారాకు వెళ్లిపోయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు ప్రస్తుతం అనారోగ్యంగా ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారని మాజీ మంత్రి ఉదయ్ సామంత్ తెలిపారు.
Updated Date - Dec 01 , 2024 | 01:57 AM