Philippine Military : దక్షిణ చైనా సముద్రంలో మరో ‘గల్వాన్’
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:14 AM
వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్ నౌకాదళ సిబ్బందిపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఆయుధాలు లేనప్పటికీ ఫిలిప్పీన్స్ సైనికులు వారిని చేతులతోనే సమర్థంగా ఎదుర్కొన్నారు.
ఫిలిప్పీన్స్ బోట్లపై విరుచుకుపడ్డ చైనా కోస్టు గార్డు
కత్తులు, గొడ్డళ్లతో దాడి.. తిప్పికొట్టిన ఫిలిప్పీన్స్ సిబ్బంది
న్యూఢిల్లీ, జూన్ 20: వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్ నౌకాదళ సిబ్బందిపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఆయుధాలు లేనప్పటికీ ఫిలిప్పీన్స్ సైనికులు వారిని చేతులతోనే సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇది నాలుగేళ్ల కిత్రం లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో భారత దేశ సైనికులపై దాడి చేసి 20 మంది ప్రాణాలు తీసిన సంఘటనను గుర్తు చేసింది. నిత్యం నీటిలో మునిగి ఉండే పగడాల దిబ్బ అయిన సెకండ్ థామస్ షోల్ విషయమై ఇరు దేశాల మధ్య వివాదం ఉంది. ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బార్జ్‌లాంటి ఓ నౌకను నిలిపి ఉంచింది. 100 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకను అత్యవసర సమయాల్లో వాహనాల రవాణా కోసం ఉపయోగిస్తుంటారు.
ఈ నౌక వద్ద సుమారు డజను మంది ఫిలీప్పీన్స్ నౌకా దళ సిబ్బంది విధులు నిర్వరిస్తుంటారు. వీరికోసం బుధవారం రెండు రబ్బరు బోట్ల (రిజిడ్ హల్ ఇన్‌ఫ్లేటబుల్ బోట్)లో ఆహారం, కొన్ని ఆయుధాలు, ఇతర పదార్థాలను తీసుకెళ్తుండగా ఎనిమిది బోట్లలో వచ్చిన చైనా కోస్టు గార్డు సిబ్బంది వారిపై దాడి చేశారు. తొలుత వారితో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లపై దూకారు. వాటిని పెద్ద ఖడ్గాలు, కత్తులు, సుత్తులతో ధ్వంసం చేశారు. ఆ పగడాల దిబ్బ చైనాదని, తమ పరిధిలోకి అక్రమంగా వచ్చారని పేర్కొంటూ దాడి చేశారు. ఫిలిప్పీన్స్ సైనికుల కోసం పెట్టెల్లో తీసుకొచ్చిన ఎనిమిది ఎం4 రైఫిల్స్, నావిగేషన్ పరికరాలు, ఇతర వస్తువులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అడ్డుకున్న సైనికులను గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫిలిప్పీన్స్ మిలటరీ విడుదల చేసింది. దీనిపై ఫిలిప్పీన్ సైనికాధికారి జనరల్ రోమియో బ్రావనర్ జూనియర్ విలేకరులతో మాట్లాడుతూ చైనా సైనికులు ‘సముద్ర దొంగలు’ అని అభివర్ణించారు. దైర్యంతో పోరాడారని అభినందిస్తూ గాయపడ్డ సైనికునికి మెడల్‌ను బహూకరించారు.
Updated Date - Jun 21 , 2024 | 03:14 AM