Phantom: ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
ABN, Publish Date - Oct 29 , 2024 | 06:54 AM
ఉగ్రవాదుల ఆచూకీ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా విషాదం ఎదురైంది. దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలించిన ఈ ఆపరేషన్‌లో ‘ఫాంటమ్’ అనే ఆర్మీ శునకం కూడా పాల్గొంగింది. అయితే ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల బుల్లెట్లు శునకానికి తగిలాయి. తీవ్రమైన గాయాలతో ‘ఫాంటమ్’ తన ప్రాణాన్ని త్యాగం చేసింది.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్‌లో ఉన్న సుందర్‌బందీ సెక్టార్‌లో నిన్న (సోమవారం) ఆర్మీ వాహనం లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడి తర్వాత ఉగ్రవాదుల ఆచూకీ కోసం చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో విషాదం ఎదురైంది. దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా అన్వేషించిన ఈ ఆపరేషన్‌లో ‘ఫాంటమ్’ అనే ఆర్మీ శునకం కూడా పాల్గొంది. అయితే ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ఫాంటమ్‌కు బుల్లెట్లు తగిలాయి. తీవ్రమైన గాయాలతో ‘ఫాంటమ్’ వీర మరణం పొందింది. ఫాంటమ్ మృతిపై ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ మన నిజమైన హీరో, వీర భారత ఆర్మీ డాగ్ ఫాంటమ్ అత్యున్నత త్యాగానికి మేము వందనం సమర్పిస్తున్నాం. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరచిపోలేము’’ అని వైట్ నైట్ కార్ప్స్ అని పిలిచే 16 కార్ప్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
కాగా ఫాంటమ్ వయసు నాలుగేళ్లు. మే 25, 2020న జన్మించింది. ఇది బెల్జియం మాలినోయిస్ జాతికి చెందినది. ఫాంటమ్ K9 యూనిట్‌లో దాడి కుక్క భాగం, ఉగ్రవాద వ్యతిరేక, తిరుగుబాటు నియంత్రణ కార్యకలాపాలలో పాల్గొనే కే9 (K9) యూనిట్‌లో భాగంగా ఉంది. మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ ఈ శునకాన్ని ఇష్యూ చేయగా.. ఆగస్టు 12, 2022న ఆర్మీలో నియమించారు. కాగా ఈ సెర్చ్-కార్డన్ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆర్మీ పేర్కొంది.
ఇక గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడి ప్రాణాలను కాపాడుతూ ‘కెంట్’ అనే ఆరేళ్ల ఆర్మీ డాగ్ కన్నుమూసింది. ఈ శునకం మొత్తం తొమ్మిది ఆపరేషన్లలో పాల్గొంది. కెంట్ కళేబరంపై త్రివర్ణ పతాకం కప్పి, పుష్ప గుచ్చం ఉంచి ఆర్మీ సిబ్బంది తుది నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి
కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..
24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు
For more Viral News and Telugu News
Updated Date - Oct 29 , 2024 | 11:10 AM