Arvind Kejriwal: పంజాబ్‌లో ఒంటరి పోరాటం.. కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 18 , 2024 | 07:28 PM
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రావడమే ఆలస్యం.. ఆ వెంటనే కాంగ్రెస్, ఆప్ మధ్య ఏమైనా చెడిందా? ఇండియా కూటమి చర్చల్లో తేడాలేమైనా వచ్చాయా?
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రావడమే ఆలస్యం.. ఆ వెంటనే కాంగ్రెస్, ఆప్ మధ్య ఏమైనా చెడిందా? ఇండియా కూటమి చర్చల్లో తేడాలేమైనా వచ్చాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటిదేమీ లేదని తాజాగా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే రెండు పార్టీలు పంజాబ్‌లో వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించాయన్నారు.
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయని.. అంతే తప్ప రెండు పార్టీల మధ్య ఎటువంటి శతృత్వం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారమే ఒంటరిగా పోటీ చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి బేధాభిప్రాయాలు కానీ, వివాదం కానీ లేవని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో.. ఢిల్లీలో సీట్ల పంపకంపై కాంగ్రెస్‌తో తమ పార్టీ చర్చలు జరుపుతోందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పొత్తు లేకపోతే.. బీజేపీకి తేలికగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేఖ్ సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కేజ్రీవాల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుండగా.. పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని తమ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంతకుముందే చెప్పారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది కూడా! తమ కాంగ్రెస్ కోరుకునేది ఇదేనని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఢిల్లీలో మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో ఆ ఏడింటినీ బీజేపీ గెలుచుకుంది. 2014లోనూ ఇదే ఘనత సాధించింది. ఈసారి అది రిపీట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయి.
Updated Date - Feb 18 , 2024 | 07:28 PM