Bengaluru: నీళ్లు లేవ్.. మాల్‌లో బాత్రూంలు వాడుకోండి.. గేటెడ్ కమ్యూనిటీ సూచన
ABN, Publish Date - Mar 08 , 2024 | 05:29 PM
వేసవికాలం మొదలుకాకముందే కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరుని(Bengaluru) పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు సంబంధించిన వార్తే ఇది. బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బెంగళూరు: వేసవికాలం మొదలుకాకముందే కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరుని(Bengaluru) పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు సంబంధించిన వార్తే ఇది. బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమ అపార్ట్‌మెంట్‌లో నీటి కొరత ఏర్పడిందని.. దీంతో సమీపంలోని ఓ మాల్‌కి వెళ్లి టాయిలెట్‌లను ఉపయోగిస్తున్నామని అతను పోస్ట్‌లో చెప్పాడు. అలా చేయాలని గేటెడ్ కమ్యూనిటీ అధికారులే చెప్పారని వివరించాడు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ప్రెస్టీజ్ ఫాల్కన్ అధికారులు స్పందించారు.
అపార్ట్‌మెంట్ వాసులు మాల్‌లలో బాత్రూమ్‌లను ఉపయోగించుకుంటున్నారనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. తాము నీటికోసం మాల్‌ని వినియోగించుకోవాలని చెప్పలేదని వారు అన్నారు. సదరు వ్యక్తి నిరాధర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. తీవ్ర నీటి సంక్షోభంతో బెంగళూరు వాసులు నిరాశ, భయం, ఆందోళనలో మునిగిపోయారు. నీటి కొరతపై సోషల్ మీడియాలో పోస్ట్‌లతో ముంచెత్తారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో సంక్షోభానికి దారితీసిందని నగర వాసులు తమ బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల వద్ద పొడవైన క్యూలు ఇప్పుడు సాధారణంగా మారాయి. అయితే కొందరు డబ్బులు వెచ్చించి నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నా.. అవీ సరిపోకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. కరవు పరిస్థితులపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "వేసవి కాలం ప్రారంభం కాలేదు. అయినా బెంగళూరులో నీటి కొరత వచ్చింది.
ఉచిత బస్సులు, ఉచిత విద్యుత్ కాదు. తాగునీరు లేకపోతే బతికేదెలా" అని ఓ వినియోగదారుడు Xలో ప్రశ్నించాడు. రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 తాలూకాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని, 109 తాలూకాలు కరవుతో అల్లాడుతున్నాయని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) తెలిపారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాజధానిలో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 వేల జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (KWSSB) ప్రకటించింది. బోర్‌వెల్‌లు ఎండిపోవడంతోనే నీటి ఎద్దడి ఏర్పడిందని, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Updated Date - Mar 08 , 2024 | 07:30 PM