Salman Khan: సల్మాన్ ఖాన్ దాడి కేసులో షాకింగ్ నిజాలు.. ఏకంగా పాకిస్తాన్ నుంచి..
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:11 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌పై (Salman Khan) జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి చేసేందుకు గాను.. పాకిస్తాన్‌కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి ఏకే-47 తుపాకుల్ని కొనుగోలు చేశారని.. ఏకే-92తో పాటు అధునాతన ఆయుధాలను సైతం తెప్పించారని సమాచారం. సల్మాన్ కారులో వెళ్తున్నప్పుడు చుట్టుముట్టి.. ఏకధాటిగా కాల్పులు జరపాలని పక్కా స్కెచ్ వేసినట్లు తేలింది. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే.. ఫామ్‌హౌస్‌లోకి దూరి, కాల్పులు జరిపేలా ప్రణాళికలు రచించారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కేసులో భాగంగా.. నవీ ముంబైలోని పన్వెల్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ దుండగులు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారని వెల్లడైంది. ఈ నలుగురే సల్మాన్‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఆ నలుగురిని ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన సుమారు 20 మంది పన్వెల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్‌హౌస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లుగా ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు బిష్ణోయ్‌తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లందరినీ పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలావుండగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే చాలాసార్లు సల్మాన్ ఖాన్‌పై దాడులు జరిపింది. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో విచారణ జరుగుతున్నప్పటి నుంచే.. ఆ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్ వస్తున్నాయి. కృష్ణజింకలను బిష్ణోయ్ వర్గం ఆరాధ్యంగా భావిస్తారు. వాటిని చంపి సల్మాన్ తమ మనోభావాల్ని దెబ్బతీశాడని, అందుకే అతనిని టార్గెట్ చేయడం జరిగిందని బిష్ణోయ్ గతంలోనే చెప్పాడు. ఆ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు కానీ.. బిష్ణోయ్ వర్గం మాత్రం అతనిని విడిచిపెట్టడం లేదు. సల్మాన్‌ను హతమార్చాలన్న ఉద్దేశంతో.. రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 03:11 PM