DMK MP A Raja: భారత్‌పై డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్ ఎటాక్
ABN, Publish Date - Mar 05 , 2024 | 05:08 PM
భారతదేశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా (Amit Malviya) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా బాల్కనైజేషన్ (Balkanisation) (ఒక దేశాన్ని స్వతంత్ర రాష్ట్రాలుగా విడగొట్టడం) కోసం పిలుపునిచ్చారని.. శ్రీరాముడ్ని కూడా అవమానించారని మండిపడ్డారు.
భారతదేశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా (Amit Malviya) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా బాల్కనైజేషన్ (Balkanisation) (ఒక దేశాన్ని స్వతంత్ర రాష్ట్రాలుగా విడగొట్టడం) కోసం పిలుపునిచ్చారని.. శ్రీరాముడ్ని కూడా అవమానించారని మండిపడ్డారు. మణిపురులపై కూడా అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజమెత్తారు. డీఎంకే నుంచి ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తూర్పారపట్టారు. దీనిపై కాంగ్రెస్ గానీ, ఇండియా కూటమిలోని ప్రధాన నాయకులు గానీ ఎందుకు నోరు మెదపడం లేదంటూ అమిత్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల మధురైలో (Madurai) ప్రసంగించిన ఏ రాజా ఇండియా ఒక దేశం కాదని పేర్కొన్నారు. ఒక దేశం అంటే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం ఉండాలని.. అప్పుడే అది దేశం అవుతుందని అన్నారు. ఇండియా దేశం కాదని, ఇదొక ఉపఖండమని తెలిపారు. భారత్‌లోని తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో రకరకాల భాషలు, సంస్కృతులు ఉన్నాయని వివరించారు. ఆర్ఎస్ భారతి చెప్పినట్లు మణిపూర్‌లో కుక్క మాంసం తింటారని.. అది కూడా ఓ సంస్కృతేనని.. అందులో తప్పేమీ లేదని వెల్లడించారు. అంతెందుకు.. మన ఇళ్లల్లోనే ఉండే వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయని.. కానీ టాయిలెట్‌లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించమని చెప్పారు.
అలాగే.. కశ్మీర్, మణిపూర్‌లలో అక్కడి సంస్కృతులుంటాయని ఏ రాజా చెప్పారు. ఒక వర్గం వాళ్లు బీఫ్ తింటే తప్పేంటని, వాళ్లేమైనా మిమ్మల్ని తనమని అడిగారా? అని ప్రశ్నించారు. మనందరిలో సైకలాజికల్ సమస్యలు ఉన్నాయని, దానిని ప్రతిఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఇదే సమయంలో తాము బీజేపీ సిద్ధాంతాలను అంగీకరించలేమని తేల్చి చెప్పారు. ఇతనే దేవుడు.. జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అని చెప్తే.. తమిళనాడు దానిని ఎప్పటికీ అంగీకరించదని వ్యాఖ్యానించారు. తాను రామాయణంను నమ్మనని కూడా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఏ రాజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ.. క్షమాపణలు చెప్పాల్సిందిగా ఏ రాజాను డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై అమిత్ మాల్వియా స్పందిస్తూ.. డీఎంకే నుంచి రెగ్యులర్‌గా ద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నాయని ఆరోపించారు. తొలుత సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు.. ఇప్పుడు భారత్‌ను బాల్కనైజేషన్ చేయాలని ఏ రాజా పిలుపునిచ్చారని మండిపడ్డారు. శ్రీరాముడిని కూడా అవహేళన చేశారని, మణిపురిలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దేశంగా బారతదేశ ఆలోచనని సైతం ప్రశ్నిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాంగ్రెస్ గానీ, ఇండియా కూటమి సభ్యులు గానీ ఎందుకు ఈ వ్యాఖ్యల్ని ఖండించడం లేదని నిలదీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 05 , 2024 | 05:08 PM