‘ఆయుష్మాన్ భారత్’లో అర్హులైన వృద్ధులను చేర్చండి
ABN, Publish Date - Sep 30 , 2024 | 05:14 AM
‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకంలో అర్హులైన వృద్ధులను చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకంలో అర్హులైన వృద్ధులను చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 70 ఏళ్లు, ఆ పైన వయసున్న వారిని ఈ పథకంలో చేర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్.ఎస్.చాంగ్‌సాంగ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ పథకంలో వృద్ధుల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలనుకునే వృద్ధులు యాప్ లేదా పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఏడాదంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ పథకం కింద సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య బీమా (ఏడాదికి రూ.5 లక్షలు) వర్తిస్తుందని తెలిపారు. ఆధార్‌లో ఉన్న వయసు ఆధారంగా వృద్ధులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Updated Date - Sep 30 , 2024 | 05:14 AM