Chennai: అయ్య బాబోయ్ దిండివనంలో బస్‌స్టేషనా.. అయితే పదవీ గండం తప్పదా..
ABN, Publish Date - Dec 06 , 2024 | 10:46 AM
ఏ ప్రాంతంలోనైనా కొత్తగా బస్‌స్టేషన్ నిర్మిస్తారంటే ఆ ప్రాంతం బాగా అభివృది చెందుతుందని అందరూ అనుకుంటారు. అయితే దిండివనం(Dindivanam) రాజకీయ నాయకులు మాత్రం ‘అయ్య బాబోయ్! బస్‌స్టేషనా? ఆ మాటెత్తితో మా పదవులకు గండమే’ అంటూ భయంతో వణికిపోతున్నారు.
- రాజకీయ నేతల గుండెల్లో గుబులు
చెన్నై: ఏ ప్రాంతంలోనైనా కొత్తగా బస్‌స్టేషన్ నిర్మిస్తారంటే ఆ ప్రాంతం బాగా అభివృది చెందుతుందని అందరూ అనుకుంటారు. అయితే దిండివనం(Dindivanam) రాజకీయ నాయకులు మాత్రం ‘అయ్య బాబోయ్! బస్‌స్టేషనా? ఆ మాటెత్తితో మా పదవులకు గండమే’ అంటూ భయంతో వణికిపోతున్నారు. ఈ భయం సెంటిమెంట్ కారణంగానే దిండివనంలో కొత్త బస్‌స్టేషన్ నిర్మాణ పథకం 32 యేళ్లుగా నత్తనడక కొనసాగుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.7.5కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసానికి ఏర్పాట్లు
‘దిండివనం ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే బస్‌స్టేషన్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, త్వరలో ఆ బస్‌స్టేషన్ నిర్మాణం జరుగుతుంది’ అంటూ 1991లో అప్పటి సౌత్ ఆర్కాడు జిల్లా కలెక్టర్ గరియాలి ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన ఆ ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. దాంతో బస్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రకటన ఆగిపోయింది. ఆ తర్వాత బస్‌స్టేషన్(Bus station) కావాలంటూ దిండివనం నాయకులు గానీ, స్థానికులు గానీ నోరుమెదపలేదు. 2001లో దిండివనం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సీవీ షణ్ముగం వక్ఫ్‌బోర్డు స్థలంలో కొత్త బస్‌స్టేషన్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
అప్పటి అన్నాడీఎంకే మునిసిపాలిటీ అధ్యక్షుడు హీరాచంద్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆ తర్వాత 2005లో, రూ.6లక్షల అడ్వాన్స్, 60 వేల అద్దె చెల్లింపు అనే ఒప్పదం ప్రకారం వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలంలో బస్‌స్టేషన్ నిర్మించడానికి మున్సిపాలిటీ అంగీకరించింది. ఆ తర్వాత ఆ యేడాదే డిసెంబర్ 30న అక్కడ తాత్కాలిక బస్‌స్టేషన్ ప్రారంభించారు. అయితే 33 రోజులు మాత్రమే నడిచిన ఆ తాత్కాలిక బస్ స్టేషన్ ఏవో కారణాల వల్ల మూతపడింది. ఆ తరువాత 2009లో దిండివనం చెరువు ప్రాంతంలో కొత్త బస్‌స్టేషన్‌ను యేడాదిలోగా నిర్మించనున్నట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు.
అయితే ఆ ప్రకారం బస్‌స్టేషన్ నిర్మాణం జరుగలేదు. దీంతో 2011 శాసనసభలో అప్పటి దిండివనం ఎమ్మెల్యే హరిదాస్ ‘దిండివనంలో వీలైనంత త్వరగా బస్‌స్టేషన్ నిర్మించాలి’ అంటూ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తమైంది. ఇలా బస్‌స్టేషన్ పేరెత్తితేనే జరగకూడనివి జరుగుతున్నాయనే సెంటింమెంట్ రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది. అప్పట్లో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే పాలకులు దిండివనం బస్‌స్టేషన్ గురించి పల్లెత్తు మాట అనకుండా మౌనం పాటించారు. ఈ పరిస్థితుల్లో గత యేడాది ఆరెకరాల్లో రూ.20 కోట్లతో కొత్త బస్‌స్టేషన్ నిర్మించనున్నట్లు అప్పటి మంత్రి సెంజి మస్తాన్ ప్రకటించారు. బస్‌స్టేషన్ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు.
అంతే! సెంజి మస్తాన్ అటు పార్టీ పదవిని, ఇటు మంత్రి పదవిని ఒకేసారి కోల్పోయారు. ప్రస్తుతం ఆ బస్‌స్టేషన్ నిర్మాణ పనులు 80 శాతం దాకా పూర్తయ్యాయి. ఆ పనులు పూర్తయితే ముఖ్యమంత్రి స్టాలిన్ దిండవనానికి వెళ్ళి లేదా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కొత్త బస్‌స్టేషన్ ప్రారంభిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై విల్లుపురం నార్త్ జిల్లా డీఎంకే కార్యదర్శి డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ బస్‌స్టేషన్ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాక దాని ప్రారంభోత్సవంపై సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు. ఇక దిండివనం అన్నాడీఎంకే ఎమ్మెల్యే అర్జునన్‌ను సంప్రదించగా.. ఆయన మాట్లాడేందుకు కూడా భయపడ్డారు.
బీజేపీ యువజన విభాగం దినేష్ కుమార్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు దిండివనం బస్‌స్టేషన్ అనే మాటెత్తితేనే జరుగకూడనివి జరుగుతాయనే భయం సెంటిమెంట్ కలెక్టర్ గరియాలి కాలం నుండే కొనసాగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా కొత్త బస్‌స్టేషన్‌ను చెరువు స్థలంలో నిర్మించి డీఎంకే ప్రభుత్వం నీటివనరులకు అడ్డుకట్ట వేసిదంటూ పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి ధ్వజమెత్తారు. ఇక దిండివనం ప్రజలేమో ‘ఇవన్నీ మూఢ నమ్మకాల వల్లే తమ ప్రాంతం అభివృద్ధిచెందటం లేదని, 32 యేళ్లకు పైగా కొత్త బస్‌స్టేషన్ వివాదం కొనసాగిందని, ప్రస్తుతం బస్‌స్టేషన్ చివరి దశ పనులను శీఘ్రంగా పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండే బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ కొత్త బస్‌స్టేషన్ ప్రారంభించే లోగా మరెన్ని కట్టుకథలు, భయం సెంటిమెంట్లు పుట్టుకువస్తాయో అనే ఆందోళన దిండివనం ప్రజలలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News
Updated Date - Dec 06 , 2024 | 10:47 AM