Chennai: కొడైకెనాల్, ఊటీలకు ‘వయనాడు’ తరహా ముప్పు?
ABN, Publish Date - Aug 09 , 2024 | 11:16 AM
కేరళ రాష్ట్రం వయనాడు(Wayanad)లో సంభవించిన ముప్పును చూసి ముక్కున వేలేసుకున్నాం.. అక్కడ ప్రకృతి సృష్టించిన విలయాన్ని చూసి విలవిల్లాడిపోయాం.. మరి మన రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్(Ooty, Kodaikanal) కొండ ప్రాంతాల పరిస్థితి ఏంటో ఊహించగలరా?.. ఇక్కడా అలాంటి ముప్పే పొంచి వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- నిపుణుల హెచ్చరికతో ఆగమేఘాలపై ముందుజాగ్రత్త చర్యలకు ప్రణాళికలు
చెన్నై: కేరళ రాష్ట్రం వయనాడు(Wayanad)లో సంభవించిన ముప్పును చూసి ముక్కున వేలేసుకున్నాం.. అక్కడ ప్రకృతి సృష్టించిన విలయాన్ని చూసి విలవిల్లాడిపోయాం.. మరి మన రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్(Ooty, Kodaikanal) కొండ ప్రాంతాల పరిస్థితి ఏంటో ఊహించగలరా?.. ఇక్కడా అలాంటి ముప్పే పొంచి వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆ రెండు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన రచిస్తోంది.
ఇదికూడా చదవండి: Manish Sisodiya: మనీష్ సిసోడియాకు భారీ ఊరట..
వయనాడులోని ముండకై, మెప్పాడి, సురల్‌మలై కొండ గ్రామాల్లో గత నెల 30వ తేది కురిసిన భారీ వర్షానికి కొండ వరద వచ్చి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. శిధిలాల్లో చిక్కుకొని, రాళ్లు తగిలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది గాయపడిన విషయం తెలిసిందే. వయనాడు ప్రధాన పర్యాటక కేంద్రం కావడంతో, కొండల వాలుపై అనేక పర్యాటక రిసార్ట్‌లను నిర్మించారు. కేరళ వెళ్లే పర్యాటకులు వాయనాడుకు తప్పకుండా వెళ్తుంటారు. వాహనాలు వెళ్లేందుకు కూడా కొత్త రోడ్లు నిర్మించారు. ప్రకృతి విరుద్ధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టుల కింద అడవిని ధ్వంసం చేశారని, ఈసారి నైరుతి రుతుపవనాల్లో నేల పట్టు కోల్పోయి వాననీరు అంతరాల్లోకి చేరి కొండచరియలు విరిగిపడడం జరిగిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వయనాడు మాదిరిగానే, రాష్ట్రంలో కొడైకెనాల్, ఊటీ, సిరుమలై, ఏర్కాడు, కొల్లి కొండ వంటి ప్రధాన వేసవి విడిది కేంద్రాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. కొడైకెనాల్, సిరుమలై, ఏర్కాడు, ఊటీల్లో పర్యాటక హోటళ్లు, వీఐపీ ఫామ్ హౌస్‌లు, నివాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బోరు బావులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొడైకెనాల్, సిరుమలై వంటి వేసవి విడిది కేంద్రాలు సహా ప్రతి పర్యాటక ప్రదేశానికి చేరుకోవడానికి రోడ్డు సదుపాయం కల్పించారు.
కొడైకెనాల్ కొండ రహదారిపై రాళ్లు, మట్టిపెళ్లలు పడి తరచూ రాకపోకలను ప్రభావితం చేస్తున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
కొడైకెనాల్‌లో 1993లో తీసుకొచ్చిన ‘మాస్టర్ ప్లాన్’కు విరుద్ధంగా భవనాలు నిర్మించారు. దీనికి సంబంధించి హైకోర్టులో కేసులు నడిచి ఆయా భవనాలపై చర్యలు తీసుకున్నా, అక్రమ భవనాల సంఖ్య తరగక పోగా, పెరుగుతూనే ఉంది. అదే విధంగా, తేని జిల్లాలో నిరంతరం వర్షాలు కురుస్తున్నప్పుడు, బోడి మెట్టు కొండ, గంపమెట్టు కొండ కనుమపై రాళ్లు దొర్లుతుంటాయి. తరచుగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఈ ప్రమాదాలు, కొండచరియలు విరిగిపడడాన్ని వెంటనే దిండుగల్, తేని జిల్లా యంత్రాంగం రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విపత్తుల నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించకుండా పర్యావరణ దార్శనిక ప్రణాళికలు రూపొందించి, ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాల నిర్వాహకులకు సూచించాలని వారు కోరుతున్నారు.
నియంత్రణ లేకుండా కొండ ప్రాంతాల్లో నివాసం...
పర్యావరణ వేత్త అరుణ్‌కుమార్ మాట్లాడుతూ... ‘‘నీలగిరి అడవులను తొలగించి తేయాకు తోటలుగా మార్చారు. పర్వత సానువుల్లో భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది, అయితే కొండచరియల్లో భవనాల సంఖ్య పెరుగుతోంది. బ్రిటీష్ పాలనలో కొడైకెనాల్, ఊటీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తుల నివాసానికి అనుమతిచ్చారు. కానీ నేడు ఎలాంటి ఆంక్షలు లేవు. ఇతర నగరాల మాదిరిగానే ప్రజలు కొడైకెనాల్, ఊటీలో స్థిరపడుతున్నారు. కొడైకెనాల్, ఎలివాల్ జతపాతం వ్యూ పాయింట్ వద్ద 2022, 2024 సంవత్సరాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. చిత్తరేవు, తడియన్ కాటేజీల మధ్య రహదారిపై ప్రతి ఏటా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మున్నార్, కుముళి వంటి ప్రదేశాల్లో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతి లేదు. కానీ, కొడైకెనాల్, ఊటీలో మాత్రం అలాంటి కఠినమైన నిబంధనలు పాటించడం లేదు. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అనుమతివ్వరాదు. వయనాడు విలయం చేసిన హెచ్చరికను ప్రభుత్వం గ్రహించాలి’’ అని సూచించారు.
కోకల్ సమీపంలో భూమి, ఇళ్లలో పగుళ్లు
నీలగిరి జిల్లా గూడలూరు సమీపంలోని కోకల్‌లో భూమి, ఇళ్లపై పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను కేంద్ర భూగర్భ శాఖ నిపుణులు బుధవారం పరిశీలించారు. వారు 20 రోజులు అక్కడే వుండి పరిశీలించనున్నారు. కొక్కల్ ప్రాంతంలో జూన్ 27, 28 తేదీల్లో కురిసిన భారీవర్షాల సమయంలో, ‘ఒకటిన్నర సెంట్’గా పిలిచే నివాస ప్రాంతాల్లోని ఇళ్లు, నర్సింగ్ హోమ్ భవనాలు పగుళ్లు ఏర్పడి దెబ్బతిన్నాయి. అ పగుళ్లు రోజురోజుకు పెరుగుతుండడంతో, గత వారం కేంద్ర జియాలజీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర భౌగోళిక శాఖకు చెందిన ఇద్దరు అధికారులు బుధవారం మరోమారు చెన్నై నుంచి గూడలూరు చేరుకొని బాధిత ప్రాంతాలు పరిశీలించారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 09 , 2024 | 11:16 AM