ప్రాణాలు తీస్తున్న వాతావరణ వైపరీత్యాలు
ABN, Publish Date - Dec 28 , 2024 | 04:33 AM
వాతావరణ మార్పులు జీవకోటికి పెను సవాల్‌గా మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల వాతావరణ వైపరీత్యాలు ఏర్పడి ఏటా వేలాది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
2024లో ప్రపంచవ్యాప్తంగా 3,700 మంది మృతి: డబ్లూడబ్ల్యూఏ నివేదిక
న్యూఢిల్లీ, డిసెంబరు 27: వాతావరణ మార్పులు జీవకోటికి పెను సవాల్‌గా మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల వాతావరణ వైపరీత్యాలు ఏర్పడి ఏటా వేలాది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 2024లో సంభవించిన 26 వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,700 మందికిపైగా మరణించారని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని తాజా నివేదిక వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న అసాధారణ పరిస్థితులపై వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (డబ్ల్యూడబ్ల్యూఏ), క్లైమేట్ సెంట్రల్ సంస్థలు అధ్యయనం చేసి.. ఆ నివేదికను శుక్రవారం వెల్లడించాయి. మానవ తప్పిదాల వలన వాతావరణానికి కలిగే హాని కారణంగా 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటున 41 రోజులపాటు విపరీతమైన వేడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ వేడి వాతావరణం వడగాడ్పులు, కరువులు, తఫాన్లు, వరదలకు కారణమైందని తెలిపింది. కేరళ పరిసర ప్రాంతాల్లో వరదలకు కూడా వాతావరణ మార్పులే కారణమని పేర్కొంది. అలాగే.. సుడాన్, నైజీరియా, కామెరూన్ దేశాల్లో సంభవించిన వరదల్లో సుమారు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని ఈ నివేదిక గుర్తుచేసింది. 2040 లేదా 2050వ దశకం నాటికి ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలమేర పెరిగితే ఈ ప్రాంతాల్లో ఏటా ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Updated Date - Dec 28 , 2024 | 04:33 AM