CM Stalin: అవును... మాది కుటుంబ పాలనే!
ABN, Publish Date - Mar 07 , 2024 | 12:22 PM
డీఎంకే రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్టే రాష్ట్రంలో కుటుంబ పాలనే కొనసాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తాపత్రయపడుతున్న పాలనే ద్రావిడ తరహా పాలన అని సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు.
- సీఎం స్టాలిన్
- నీంగళ్ నలమా పథకానికి శ్రీకారం
చెన్నై: డీఎంకే రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్టే రాష్ట్రంలో కుటుంబ పాలనే కొనసాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తాపత్రయపడుతున్న పాలనే ద్రావిడ తరహా పాలన అని సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం నీంగళ్ నలమా పేరిట కొత్త పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితాలు సక్రమంగా ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అని నిర్ధారించుకునే దిశగా ఈ పథకం అమలు కోసం www.neengalnala maa.tn.gov.inను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం ద్వారా లబ్ధిపొందుతున్న శివగంగ జిల్లా నెర్‌కుప్పైకి చెందిన ధనలక్ష్మి అనే గృహిణితో ఫోన్‌లో సంభాషించారు. అల్పాహార పథకం ద్వారా లబ్ధిపొందుతున్న తిరువళ్లూరు సేరాంజేరి పంచాయతీ పాఠశాల విద్యార్థి భవనేష్ తండ్రి ప్రభుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇదే విధంగా వివిధ పఽథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారితో సీఎం ఫోన్‌లో మాట్లాడి సక్రమంగా అమలవుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగిస్తూ...
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆచితూచి ప్రజలకు అవసరమైన పథకాలను ఎంపిక చేసి వరుసగా అమలుచేస్తోందన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రారంభించిన పథకమే ‘నీంగళ్ నలమా?’ (మీరు కుశలమేనా?) అన్నారు. ఈ పథకం పేరునుబట్టే ప్రజలపైన ప్రభుత్వానికి ఉన్న అభిమానం తెలుసుకోవచ్చన్నారు. మూడేళ్లలో డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో అత్యధికంగా ప్రజలు లబ్ధి పొందిన పథకాలను పరిశీలిస్తే వాటిలో మహిళల వెలుగుబాట పయనం, పుదుమై పెణ్, బడిపిల్లల అల్పాహార పథకం, కలైంజర్ మహిళా సాధికారిక నగదు పంపిణీ, ఇళ్ల వద్దకే విద్య, వైద్యం, ఒలంపిక్ అన్వేషణ, నాన్ ముదల్వన్, మీ నియోజకవర్గంలో సీఎం, ముదల్వరిన్ ముగవరి (సీఎం చిరునామా), క్షేత్రపరిశీలనలో ముఖ్యమంత్రి వంటి పథకాలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. ద్రావిడ తరహా ప్రభుత్వ పాలనలో ప్రకటించిన పథాకల వల్ల లబ్ధిపొందనివారే లేరు, తాను పర్యటించే ప్రతిచోటా తనను కలుసుకునే ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూడగలుగుతున్నానని చెప్పారు.
ఇవిగో ఫలితాలు..
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల గ్రామాల్లోనూ సామాన్య ప్రజలు కూడా ప్రయోజనం పొందుతున్నారని సీఎం చెప్పారు. వెలుగుబాట పయనం ద్వారా ఇప్పటివరకూ మహిళలు ప్రతినెలా రూ.888ను పొదుపు చేయగలుగుతున్నారని, ప్రజల వద్దకే వైద్యం పఽథకం ద్వారా కోటిమందికి పైగా లబ్ధిపొందారని చెప్పారు. సీఎం అల్పాహారం ద్వారా 16 లక్షల మంది బాలబాలికలు పస్తులు లేక విద్యనభ్యసిస్తున్నారని, పుదుమై పెణ్ పథకం ద్వారా 4.81లక్షల మందికిపైగా విద్యార్థినులు ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థికసాయాన్ని పొంది డిగ్రీలు సంపాదించుకోనున్నారని, నాన్ ముదల్వన్ ద్వారా రెండేళ్లలో 2.28లక్షల మంది యువకులు తమ ప్రతిభాపాటవాలను పెంపొందించుకున్నారని తెలిపారు. ఇక ఇళ్ల వద్దకే విద్య పథకం ద్వారా 24.86లక్షల మంది బడిపిల్లలు ప్రయోజనం పొందారన్నారు. అలాగే రాష్ట్రంలో 62 లక్షలకు పైగా ఇళ్లకు కొళాయి కనెక్షన్లు పొందారని, కొత్తగా 2 లక్షల మంది రైతులు ఉచిత విద్యుత్ పొందుతున్నారన్నారు. ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేసే పథకాలను ద్రావిడ తరహా పాలనను అందిస్తుంటే తమ ప్రత్యర్థులు కుటుంబ పాలన అనడం విడ్డూరంగా ఉందన్నారు.
మోదీ నోట పచ్చి అబద్దాలు...
ఇటీవల నగరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ అసత్యాలను మాట్లాడి అభాసుపాలయ్యారని స్టాలిన్ విమర్శించారు. కేంద్రప్రభుత్వం తన నిధులను రాష్ట్రప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తే అవినీతి జరుగుతుందని భావించే నేరుగా ప్రజలకు నిధులను అందిస్తున్నామనడం గర్హనీయమన్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంపిణీ చేసిన నిధుల వివరాలను ఆయన ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. చెన్నై సహా నాలుగు జిల్లాలు మిచౌంగ్ తుఫానుకు, తిరునల్వేలి సహా నాలుగు జిల్లాలు వరదలకు నష్టపోతే కేంద్రప్రభుత్వం నిధులివ్వలేదని గుర్తు చేశారు. తుఫాను, వరద బాధితులను ఆదుకునేందుకు రూ.37 వేల కోట్ల మేరకు నిధులివ్వాలని అడిగితే ఇప్పటి వరఉ పైసా విడుదల కాలేదన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే రూ.3,406 కోట్లతో వరద, తుఫాను బాధితులను సకాలంలో ఆదుకుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి అందరినీ ఆదుకోవడమే డీఎంకే తరహా ద్రావిడ పాలన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, అదనపు ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శి ఎన్. మురుగానందం, ముదల్వరిన్ ముగవరి శాఖ ప్రత్యేక అధికారి డి. మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 07 , 2024 | 12:22 PM