Lok sabha Elecitons: కాంగ్రెస్‌కు ఒక్కటే... కుండబద్ధలు కొట్టిన ఆప్
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:06 PM
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ న్యూఢిల్లీలో కాంగ్రెస్‌తో లోక్‌సభ సీట్ల పంపకాలపై తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఢిల్లీలో ఒక సీటుకు కూడా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని, అయినప్పటికీ కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌కు ఒక సీటు ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ 'ఇండియా' (INDIA) కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇప్పటికే కూటమి భాగస్వామ్య పార్టీలుగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, పంజాబ్ 'ఆప్' ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, న్యూఢిల్లీలోని అధికార 'ఆప్' సైతం కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల వ్యవహారంలో కరాఖండిగా వ్యవహరిస్తోంది. తాజాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సందీప్ పాఠక్ (Sandeep Pathak) న్యూఢిల్లీలో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఢిల్లీలో ఒక సీటుకు కూడా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని, అయినప్పటికీ కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌కు ఒక సీటు ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
''మెరిట్ ప్రాతిపదికగా చూసినప్పుడు ఢిల్లీలో ఒక్క సీటు పోటీకి కూడా కాంగ్రెస్‌కు అర్హత లేదు. అయినప్పటికీ కూటమి ధర్మాన్ని పాటించి ఒక సీటు ఆఫర్ చేశాం. ఆప్ ఆరు సీట్లలో పోటీ చేస్తుంది'' అని సందీప్ పాఠక్ మీడియాతో మంగళవారంనాడు మాట్లాడుతూ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సీట్ల షేరింగ్ చర్చలు ముగించాలని ఆప్ కోరుతోందన్నారు. కాగా, ఆప్ ఇప్పటికే గుజరాత్‌తో 2 లోక్‌సభ స్థానాలకు, గోవాలో ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతానికి అనుగుణంగా గుజరాత్‌లోని 26 సీట్లలో తమకు 8 సీట్లు కేటాయించాలని 'ఇండియా' బ్లాక్‌ను ఆప్ కోరుతోంది.
Updated Date - Feb 13 , 2024 | 04:06 PM