Himachal Crisis: ఆరుగురు సభ్యులతో కాంగ్రెస్ సమన్వయ కమిటీ
ABN, Publish Date - Mar 10 , 2024 | 09:23 PM
సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు ప్రకటించారు.
సిమ్లా: సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukvinder Singh Sukhu) సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని (Co-ordination committee) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆదివారంనాడు ప్రకటించారు. ముఖ్యమంత్రి సుఖుతో పాటు, ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, కౌల్ సింగ్ ఠాకూర్, ధనిరామ్ శాండిల్, రామ్ లాల్ ఠాకూర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రాజకీయ సవాళ్లకు బెదరం: సుఖు
కాగా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీన పరచేందుకు బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై ముఖ్యమంత్రి సుఖు విరుచుకుపడ్డారు. రాజకీయ సవాళ్లకు తాము బెదిరే ప్రసక్తే లేదన్నారు. సోలాన్‌లో రూ.186 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2032 నాటికి స్వయంసమృద్ధి హిమాచల్ విజన్‌ను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, ఎలాంటి సవాళ్లను ఖాతరు చేయమని చెప్పారు. ప్రజలు కష్టార్జితం నుంచి చెల్లిస్తు్న్న పన్నులతో కొన్ని దుష్టశక్తులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. సమ్మిళిత వృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం దృష్టిసారిస్తే, ప్రభుత్వాన్ని బలహీనపరచేందుకు అనుచిత, అప్రజాస్వామిక పద్ధతులను బీజేపీ అవలభిస్తోందని తప్పుపట్టారు. అవినీతిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, రాష్ట్ర వనరులను ప్రజల సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వెచ్చిస్తామని స్పష్టం చేశారు.
Updated Date - Mar 10 , 2024 | 09:23 PM