Sam Pitroda: దక్షిణాదివారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు..
ABN, Publish Date - May 09 , 2024 | 03:17 AM
ఎన్నికల వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత శామ్‌పిట్రోడా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు! వారసత్వ పన్ను వ్యాఖ్యలతో కాంగ్రె్‌సకు ఇప్పటికే ఒకసారి తిప్పలు తెచ్చిపెట్టిన ఆయన.. తాజగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాదివారు శ్వేతజాతీయుల్లా.. ఈశాన్య రాష్ట్రాలవారు చైనీయుల్లా.. పశ్చిమ రాష్ట్రాలవారు అరబ్బుల్లా ఉంటారు
రాష్ట్రపతిగా ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఇందుకే!
శరీర రంగును బట్టి అవమానిస్తే సహించం: మోదీ
బీజేపీనేతల ధ్వజం.. ఆయన వ్యక్తిగతమన్న కాంగ్రెస్ పార్టీ పదవికి శామ్‌పిట్రోడా రాజీనామా
కాంగ్రెస్ నేత శామ్‌పిట్రోడా వ్యాఖ్యలు
శరీర వర్ణం ఆధారంగా అవమానిస్తే సహించేది లేదు: ప్రధాని మోదీ
పార్టీ పదవికి పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ, మే 8: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత శామ్‌పిట్రోడా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు! వారసత్వ పన్ను వ్యాఖ్యలతో కాంగ్రె్‌సకు ఇప్పటికే ఒకసారి తిప్పలు తెచ్చిపెట్టిన ఆయన.. తాజగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ఎన్నో వైవిధ్యాలున్న దేశంగా అభివర్ణించే క్రమంలో.. దక్షిణభారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారని.. పశ్చిమ రాష్ట్రాలవారు అరబ్బుల్లా, ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా, ఉత్తరాది వారు తెల్లవారిలా ఉంటారని వ్యాఖ్యానించారు. ‘ద స్టేట్స్‌మన్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ‘‘మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటి్‌షవారితో పోట్లాడింది హిందూ దేశం కోసం కాదు.. లౌకిక దేశం కోసం.
మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నాం. మనమేమో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికిఉదాహరణగా నిలిచాం. చిన్నచిన్న విభేదాలున్నా మనం ఈ 75 ఏళ్లూ చాలా సంతోషకరమైన వాతావరణంలో మనగలిగాం. ఎన్ని తేడాలున్నా మనందరం సహోదరులం. విభిన్న భాషలు, మతాలు, ఆచారాలు, ఆహారాన్ని పరస్పరం గౌరవించుకుంటాం’’ అని పేర్కొంటూ.. దేశ వైవిధ్యం గురించి చెప్పే క్రమంలో ఆఫ్రికన్లు, చైనీయులతో భారతీయులను పోల్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.
భారతదేశ భిన్నత్వం గురించి చెప్పడానికి శామ్‌పిట్రోడా పోల్చిన తీరు పూర్తిగా తప్పు అని, ఆ పోలికలు ఆమోదయోగ్యం కానివని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. శరీర వర్ణం ఆధారంగా అవమానించడాన్ని ఈ దేశం సహించదని.. తాను అస్సలు సహించబోనని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము శరీర వర్ణం కారణంగానే.. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాష్ట్రపతి పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిందనే విషయం తనకు ఇప్పుడు అర్థమవుతోందని... ముర్ము చర్మం రంగు నల్లగా ఉంది కాబట్టి కాంగ్రెస్ నేతలు ఆమెను ఆఫ్రికన్‌గా భావించారని వ్యాఖ్యానించారు.
ఆలోచన విధానాన్ని బయటపెట్టుకొన్నారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో శామ్ పిట్రోడా వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసి.. ‘‘నేను దక్షిణాదికి చెందిన దాన్నే. నేను ఇండియన్‌లాగానే కనపడతాను. మా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారున్నారు. వాళ్లూ భారతీయుల్లాగానే ఉంటారు. పశ్చిమభారతదేశానికి చెందిన నా కొలీగ్స్ కూడా భారతీయుల్లాగానే ఉంటారు. కానీ.. రాహుల్‌గాంధీ సలహాదారు, జాత్యహంకారి అయిన వ్యక్తికి మాత్రం మేమందరం ఆఫ్రికన్లలా, చైనీయుల్లా, అరబ్బుల్లా, తెల్లవారిలా కనపడతాం.
మీ ఆలోచనాధోరణిని, వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. ఇండీ కూటమీ.. సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అసోం సీఎం హిమంత ట్విటర్‌లో శామ్‌పిట్రోడాను ఉద్దేశించి.. ‘‘శామ్ భాయ్, నేను ఈశాన్య రాష్ట్రానికి చెందినవాడినే. నేను భారతీయుడిలాగానే ఉంటాను’’ అని వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లేమో.. ‘దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారు’ అంటూ గతంలో బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. అయితే.. తన వ్యాఖ్యలు ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆమోదించినట్టు జైరామ్ రమేశ్ తెలిపారు.
బీజేపీ పోస్టుపై వివాదం
బెంగళూరు, మే 8(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇటీవల బీజేపీ పెట్టిన ఓ పోస్టు వివాదాస్పదమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లను ముస్లింలకు అనుకూలంగా కాంగ్రెస్ మార్చనుందని అందులో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను తక్షణమే తొలగించాలని కర్ణాటక బీజేపీని రాష్ట్ర చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా ఆదేశించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, పార్టీ ఐటీసెల్ హెడ్ అమిత్ మాలవీయకు పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టుపై హేగ్రౌండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ పోస్టును తొలగించాలని ఎన్నికల కమిషన్ సూచించినా కర్ణాటక బీజేపీ స్పందించలేదు. దీంతో ‘ఎక్స్’ సంస్థకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటీస్ ఇచ్చింది. ఐటీ యాక్ట్ 79(3)(బీ) ప్రకారం వివాదాస్పద పోస్ట్‌ను తొలగించాలని ఈ నెల 5న ఈసీ సూచించింది.
Updated Date - May 09 , 2024 | 03:17 AM