Congress: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త వ్యూహం.. మరిన్ని సీట్లు కావాలని డీఎంకేపై ఒత్తిడి
ABN, Publish Date - Jan 13 , 2024 | 07:43 AM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి రాష్ట్రం నుంచి పదికంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్(State Congress) భావిస్తోంది. ఈ మేరకు తమకు మరిన్ని సీట్లు కావాలని డీఎంకేపై ఒత్తిడి పెంచుతోంది.
- కొత్త నియోజకవర్గాల్లో పోటీ!
- మరిన్ని సీట్ల కోసం డీఎంకేపై ఒత్తిడి?
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి రాష్ట్రం నుంచి పదికంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్(State Congress) భావిస్తోంది. ఈ మేరకు తమకు మరిన్ని సీట్లు కావాలని డీఎంకేపై ఒత్తిడి పెంచుతోంది. అంతేగాక ఇప్పటికే తమకు అనువైన నియోజకవర్గాల జాబితా సిద్ధం చేసింది. త్వరలోనే దీన్ని డీఎంకే అధిష్ఠానానికి అందజేయనుంది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు తిరువళ్లూరు, కృష్ణగిరి, ఆరణి, కరూరు, తిరుచ్చి, శివగంగ, తేని, విరుదునగర్, కన్నియాకుమారి నియోజకవర్గాలను డీఎంకే కేటాయించింది. ప్రస్తుతం డీఎంకే కరూరు, తిరుచ్చి, విరుదునగర్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల గడువు మాత్రమే ఉండటంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయంపై దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి కూడా డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్ కొనసాగనుంది. ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో ‘ఇండియా కూటమిలో’ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీలు వీలలైనంత త్వరగా కూటములను స్థిరపరచుకోవాలంటూ ఆ కూటమి నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, సీఎల్పీ నేత సెల్వపెరుంతగై కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పార్టీకి కేటాయించిన సీట్ల వివరాలు, ఎన్ని సీట్లలో పార్టీ గెలిచిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఈసారి నియోజకవర్గాల మార్పులు చేర్పులపై కూడా అళగిరితో ఖర్గే ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నియోజకవర్గాలపైనా ఆరా తీశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీచేసి తేని మినహా ఎనిమిదింట్లో గెలిచింది. ఈసారి మరికొన్ని నియోజకవర్గాలను కేటాయించాలంటూ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకేపై ఒత్తిడి చేయనుంది.
కూటమిలో కొత్త పార్టీలు చేరే అవకాశాలు అధికమైతే తొమ్మిది సీట్లకు తగ్గకుండా ప్రయత్నించాలని ఖర్గే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. కూటమిలోని మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పోటీ చేసి గెలిచిన సీట్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈసారి కరూరు, తిరుచ్చి, విరుదునగర్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డీఎంకే భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు కేటాయించాల్సిన సీట్ల ఎంపికపై డీఎంకే పరిశీలన జరుపుతోంది. నియోజకవర్గాల చేర్పులు, మార్పులు జరిగినప్పటికీ తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాథపురం, తంజావూరు, మైలాడుదురై, పెరంబలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, ఈరోడ్ నియోజకవర్గాలను తప్పకుండా తమకు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డీఎంకేపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాల జాబితాను టీఎన్‌సీసీ... పార్టీ హైకమాండ్‌కు పంపినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Jan 13 , 2024 | 07:43 AM