ఎన్నికల వీడియోలు ఎవరికీ ఇవ్వొద్దు
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:43 AM
ఎన్నికల ప్రక్రియపై మరో వివాదం నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన ఎలకా్ట్రనిక్ సమాచారం ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రజల తనిఖీకి అవకాశం లేదు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 21: ఎన్నికల ప్రక్రియపై మరో వివాదం నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన ఎలకా్ట్రనిక్ సమాచారం ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించడంపై విమర్శలు వస్తున్నాయి. హరియాణా ఎన్నికలపై కోర్టుల్లో పలు వ్యాజ్యాలు దాఖలవుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంఽధించిన ఎలకా్ట్రనిక్ సమాచారమైన సీసీటీవీ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులను ప్రజల తనిఖీ నిమిత్తం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం తెలిపింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 92(3)(ఏ)లో ‘‘ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలన్నీ ప్రజల తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచాలి’’ అని ఉంది. కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం ఈ నిబంధనలో సవరణ చేసింది. ‘‘ఎన్నికలకు సంబంధించి ఈ నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే ప్రజల తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచాలి’’ అని పేర్కొంది.
‘అన్ని పత్రాలు’ అన్న మాటలకు బదులుగా ‘ఈ రూల్స్‌లో పేర్కొన్న పత్రాలు’ అన్న సవరణ చేసింది. అంటే ఆ నిబంధనల్లో సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు వంటి ప్రస్తావనలు లేకపోవడంతో వాటిని ఇవ్వాల్సిన పనిలేదు. ఎలకా్ట్రనిక్ సమాచారం దుర్వినియోగమవుతున్నందువల్లనే ఈ సిఫార్సు చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. అయితే, ‘‘నిబంధనలను సవరించినప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులకు మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కోర్టును ఆశ్రయించి ఎలకా్ట్రనిక్ సమాచారం పొందవచ్చు’’ అని ఆయన వివరించారు. హరియాణా ఎన్నికలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు కావాలని న్యాయవాది మెహమూద్ ప్రాచా అక్కడి హైకోర్టును ఆశ్రయించగా అందుకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. వాటిని అడ్డుకునేందుకే ఈరూల్స్‌ను సడలించారన్న విమర్శలు వస్తున్నాయి.
Updated Date - Dec 22 , 2024 | 02:43 AM