Navya: దాశరథి.. శ్రీశ్రీ.. విశ్వనాథ..!
ABN, Publish Date - Jun 09 , 2024 | 02:54 AM
ఒకప్పుడు జ్ఞాన్‌భాగ్ తెలుగు, ఉర్దూ, హిందీ, పర్షియన్ కవులకు నిలయంగా ఉండేది. అనేక మంది కవులు వస్తూ పోతూ ఉండేవారు. నితరం కవి సమ్మేళనాలు జరిగేవి. ఇలాంటి సమ్మేళనాల నేపథ్యంలో తెలుగులో గొప్ప కవులైన దాశరథి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి కవులను కలిశాను. ఈ ఏడాది దాశరథి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఆయనతో నాకు మంచి స్నేహం ఉండేది.
అలనాటి కథ
ఒకప్పుడు జ్ఞాన్‌భాగ్ తెలుగు, ఉర్దూ, హిందీ, పర్షియన్ కవులకు నిలయంగా ఉండేది. అనేక మంది కవులు వస్తూ పోతూ ఉండేవారు. నితరం కవి సమ్మేళనాలు జరిగేవి. ఇలాంటి సమ్మేళనాల నేపథ్యంలో తెలుగులో గొప్ప కవులైన దాశరథి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి కవులను కలిశాను. ఈ ఏడాది దాశరథి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఆయనతో నాకు మంచి స్నేహం ఉండేది.
ఈ కాలమ్ రాసే ముందు నేను ఒక విషయాన్ని అందరి ముందూ ఒప్పుకోవాలి. నాకు తెలుగు చదవటం, రాయటం రాదు. కానీ దానిలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలను. శేషేంద్ర నాకు చాలాసార్లు తెలుగు లిపి నేర్పించటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తెలుగు అక్షరాలలో ఉండే ఒంపులను నేను ఒడిసి పట్టుకోలేకపోయా! తొలి తెలుగు రచయితల సమావేశాలు (తెలుగు విశ్వ సమ్మేళనం) హైదరాబాద్‌లోని ఆంధ్ర మహాసభ భవనంలో జరిగాయి.
దీనికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కవులందరూ హాజరయ్యారు. అరిపరాల విశ్వం, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, ఎల్లోరా, అజంతా, శ్రీశ్రీ, దాశరథి... ఇలా సంజీవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మహామహులు వచ్చారు. నేను ఉపాధ్యక్షురాలిని. ‘‘తెలుగు భాషను గుర్తించలేని దానివి... నువ్వు ఆ సమావేశాలకు ఎందుకు వెళ్తున్నావు?’’ అని నా స్నేహితులు ఆట పట్టించారు.
‘‘నేను ఈ ప్రాంతానికి చెందినదాన్ని. ఇక్కడ ఇంత పెద్ద సభలు అవుతుంటే నేనేందుకు వెళ్లకూడదు’’ అని వాళ్లకు సమాధానమిచ్చా. నేను ఒక సెషన్‌కు అధ్యక్షురాలిని. సాధారణంగా తెలుగు సమావేశాలంటే అందరూ తెలుగులోనే మాట్లాడ తారనుకుంటాం కదా! తెలుగులో మాట్లాడలేక పోయినందుకు నేను కొంత ఇబ్బంది పడ్డా. కానీ అదే సెషన్‌లో శేషేంద్ర తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషులో ప్రసంగించాడు. బహుశా నా గురించే ఇంగ్లీషులో ప్రసంగించాడని అనుకున్నా. ఆ సమావేశాలలో పాల్గొనటానికి కొందరు అతిథులు మారిషస్ నుంచి వచ్చారు. వారిలో కొందరు జ్ఞాన్‌భాగ్‌లోనే ఉంటున్నారు.
అందువల్ల వారందరి కోసం ఆ రోజు రాత్రి ఒక కవితా గోష్ఠి ఏర్పాటు చేశాను. ఆ మర్నాడు జరిగిన సమావేశాల్లో తొలిసారి నేను దాశరథిని కలిశాను. ఆ పరిచయం ఆ తర్వాతి కాలంలో స్నేహంగా మారింది. ఈ సమావేశాల తర్వాత నేను ఊటీ వెళ్లిపోయాను.
ఊటీ నుంచి వచ్చిన తర్వాత కొందరు ఉర్దూ రచయితలు నా దగ్గరకు వచ్చి... ‘‘శ్రీశ్రీని కలవాలనుకుంటున్నాం. సమావేశం ఏర్పాటు చేస్తారా’’ అని అడిగారు. తమాషా ఏమిటంటే... నేను అప్పటిదాకా ఎప్పుడూ శ్రీశ్రీని కలవలేదు. కానీ ఆయన గురించి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఉర్దూ రచయిత ముక్దుం మోయినుద్దీన్ ద్వారా విన్నా. ముక్దుంతో మా నాన్న ధన్‌రాజ్‌గిర్‌కు మంచి స్నేహం ఉండేది. రోజూ ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఒక రోజు ముక్దుం నాకు ఒక ఇంగ్లీషు కవితల పుస్తకం ఇచ్చి... ‘‘దీని పేరు ‘త్రీ చీర్స్ ఫర్ ఏ మ్యాన్’.
ఇది తెలుగు కవితలకు అనువాదం. ఇతను చాలా గొప్పగా రాస్తున్నాడు. నువ్వు కూడా చదువు’’ అన్నారు. ఆ సమయంలో మా తరం వారందరం ప్రోగ్రెసివ్ రచయితల ప్రభావంలో ఉండేవాళ్లం. మిగిలినవారి పట్ల పెద్ద గౌరవం ఉండేది కాదు. అయినా శ్రీశ్రీ కవితల అనువాదాన్ని చదివాను. చాలా బావున్నాయనిపించింది. కానీ శ్రీశ్రీని కలిసే అవకాశం దొరకలేదు. అయితే ఉర్దూ రచయితల కోరికవల్ల ఆ అవకాశం చిక్కింది. శ్రీశ్రీని శేషేంద్ర ఒక రోజు జ్ఞాన్‌బాగ్‌కు పిలిచాడు. ఆ రోజు ఉర్దూ పత్రిక ‘సియాసత్’ ఎడిటర్‌ను కూడా పిలిచిన జ్ఞాపకం. శ్రీశ్రీని శేషేంద్ర వెళ్లి కారులో ఽజ్ఞాన్‌బాగ్‌కు తీసుకువచ్చాడు. ఆ రోజంతా చాలా ఉత్సాహంగా సాగింది. శ్రీశ్రీతో అలా ప్రారంభమయిన నా పరిచయం చాలా కాలం కొనసాగింది.
ఇక నేను మరచిపోలేని మరో మహాకవి విశ్వనాఽథ సత్యన్నారాయణ. ఒకసారి రవీంద్రభారతి కవి సమ్మేళనంలో ఆయన్ను చూశాను. ఆ సమ్మేళన నిర్వాహకులు ఇద్దరు... ఆయనను స్టేజీ మీద కూర్చోబెట్టారు. నేను ముందు వరసలోనే ఉన్నా. ఆయన సభలో ఉన్నవారందరినీ నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఉపస్యాసం ప్రారంభించారు. అదొక గంగా ప్రవాహంలా సాగిపోయింది. ఆయనను నేను తొలిసారి చూసింది అప్పుడే. సభ పూర్తయిన తర్వాత తిరిగి వెళ్తుంటే... ఆయనకు నమస్కారం చేశా. విశ్వనాథ తల పంకించి వెళ్లిపోయారు. ఆ తర్వాత శేషేంద్రతో నా వివాహం జరిగింది. ఇది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. విశ్వనాఽథ వారి శిష్యులు కొందరు ఈ వివాహంపై విమర్శలు కురిపించటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే విశ్వనాఽథ వారికి ‘జ్ఞానపీఠ్’ పురస్కారం వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎవరో నా వివాహ ప్రస్తావన తెచ్చారట. అప్పుడు ఆయన... ‘‘తప్పేముంది. ఆమె కూడా మన తెలుగు అమ్మాయేగా’’ అన్నారట. ఆ తర్వాత విమర్శలన్నీ ఆగిపోయాయి. విశ్వనాఽథ వారికి జ్ఞాన్‌పీఠ్ వచ్చిన తర్వాత... ఆయనను జ్ఞాన్‌భాగ్‌కు ఆహ్వానించాం. మా మ్యూజిక్ రూమ్‌లో అనేకమంది అతిథుల ముందు ఆయన ‘శాకుంతలం’ చదివారు. ఆయన వాగ్ధాటికి అక్కడి వారందరూ ముగ్దులయ్యారు. ఇలా రకరకాల సందర్భాలలో నాకు తెలుగు కవులను కలిసే అవకాశం చిక్కింది.
విశ్వనాఽథ వారి శిష్యులు కొందరు శేషేంద్రతో నా వివాహంపై విమర్శలు కురిపించటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే విశ్వనాఽథ వారికి ‘జ్ఞానపీఠ్’ పురస్కారం వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎవరో నా వివాహ ప్రస్తావన తెచ్చారట. అప్పుడు ఆయన... ‘‘తప్పేముంది. ఆమె కూడా మన తెలుగు అమ్మాయేగా’’ అన్నారట.
రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్
Updated Date - Jun 09 , 2024 | 02:54 AM