ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : కేజ్రీకి బెయిల్‌

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:41 AM

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

  • సీబీఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు

  • ఇంతకుముందే ఈడీ కేసులో విముక్తి

  • జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం

  • విచారణ సందర్భంగా.. సీబీఐ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం

  • బెయిల్‌ మీద విడుదలవుతుంటే అరెస్టు చేయాల్సినంత తొందరేమిటి?

  • పంజరంలో చిలుకలా ఉండొద్దు

  • నిష్పాక్షికంగా వ్యవహరించండి

  • దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు

జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు. నా ప్రతి రక్తపు బొట్టు దేశ సేవ కోసమే. నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. అయితే దేవుడు ఆ కష్ట సమయాల్లో నాకు మద్దతుగా ఉన్నాడు.

- అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేర నిరూపణ జరగకుండానే నిందితులను సుదీర్ఘకాలంపాటు జైలులో నిర్బంధించటం వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించటమేనని అత్యున్నత న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది. పంజరంలో చిలుకలా కాకుండా.. స్వేచ్ఛగా తిరిగే చిలుకలా ఉండాలని సీబీఐకి హితబోధ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగాల నుంచి కేజ్రీవాల్‌కు గతంలోనే బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే.

అయితే, అదే కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయటంతో.. జైలు నుంచి విడుదల కాలేదు. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో, కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ తొలుత విచారణ కోర్టుకు వెళ్లలేదని, కాబట్టి, ఆయన విజ్ఞప్తిని విచారణ కోర్టుకు బదిలీ చేయాలని పేర్కొన్నారు.

బెయిల్‌ కోసం తొలుత ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలన్నది వాస్తవమేనని ధర్మాసనం అంగీకరిస్తూ.. హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపినప్పుడు.. కేసును కింది కోర్టుకు బదిలీ చేసి ఉండాల్సిందని స్పష్టం చేసింది. ‘ఈ దశలో ఇప్పుడు, తిరిగి ఈ కేసును విచారణ కోర్టుకు పంపించటం సరైంది కాదు. బెయిల్‌ వ్యక్తిగత స్వేచ్ఛతో ముడివడిన అంశం. ఇటువంటి కేసులను వాటిలో ఉన్న సానుకూలతల (మెరిట్స్‌) ఆధారంగా నిర్ణయించాలేగానీ.. సాంకేతిక అంశాలను చూపుతూ కోర్టుల మధ్య తిరిగేలా చేయకూడదు’ అని పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సమీప భవిష్యత్తులో పూర్తయ్యేలా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


  • న్యాయమూర్తులు.. విడిగా తీర్పులు

కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇస్తూనే.. తీర్పును న్యాయమూర్తులిద్దరూ వేర్వేరుగా వెలువరించారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ 27 పేజీల తీర్పును, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 33 పేజీల తీర్పును ఇచ్చారు. సీబీఐ తీరును జస్టిస్‌ భుయాన్‌ ప్రశ్నించారు. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చి జైలు నుంచి కేజ్రీవాల్‌ విడుదలయ్యే తరుణంలో ఆయనను సీబీఐ అరెస్టు చేయటాన్ని ప్రశ్నించారు. ‘దేశంలోని ఒక ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ సీబీఐ. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సీబీఐ నిష్పక్షపాతంగా ఉండటమే కాదు.. అలా ఉన్నట్లు కనిపించాలి.

సీజర్‌ భార్యలాగా ఒక దర్యాప్తు సంస్థ కూడా నిష్పాక్షికంగా ఉండాలి. కొంతకాలం కిందటే ఈ కోర్టు సీబీఐని పంజరంలో చిలకతో పోల్చింది. తనపై ఉన్న ఈ ముద్రను సీబీఐ తొలగించుకోవాలి’ అని జస్టిస్‌ భుయాన్‌ హితవు పలికారు. (దర్యాప్తు మొదలైన తర్వాత) 22 నెలల సుదీర్ఘ కాలవ్యవధిలో లేని తొందర.. ఈడీ బెయిల్‌ మంజూరు చేయగానే ఎందుకు వచ్చింది? అప్పటికప్పుడే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు? అని నిలదీశారు. ఇవే అభియోగాలకు సంబంధించి ఈడీ కేసులో బెయుల్‌ లభించిన వ్యక్తిని ఇంకా జైలులో నిర్బంధించటం అంటే న్యాయాన్ని నిరాకరించటమేనన్నారు.


  • మద్యం కేసు ఫైళ్లపైనే ఆంక్షలు: సింఘ్వీ

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన ఫైళ్లు తప్ప ఇతర ఏ ఫైల్‌ మీదైనా సీఎం కేజ్రీవాల్‌ సంతకం చేయవచ్చని, బెయిల్‌ ఆంక్షలు కేవలం మద్యం పాలసీ ఫైళ్లకు మాత్రమే పరిమితమని ఆయన తరఫున వాదించిన అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. కేజ్రీవాల్‌ విడుదలయ్యారుకానీ.. ఎటువంటి అధికారాలు ఉండవంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేజ్రీవాల్‌ అధికారాల్ని ఢిల్లీ ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన తప్ప మరే శక్తీ తొలగించలేదని పేర్కొన్నారు.


  • సీఎం ఆఫీసుకు వెళ్లొద్దు..

సీఎం కార్యాలయానికి, ఢిల్లీ సచివాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకం చేయవద్దని, ఏదైనా ఫైల్‌ మీద సంతకం తప్పనిసరైతే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని కేజ్రీవాల్‌ మీద ఈడీ కేసులో బెయిల్‌ ఆంక్షలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ.. ఈడీ కేసు బెయిల్‌లో విధించిన ఆంక్షలనే విధించటం గమనార్హం. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఇదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీ ఇవ్వాలని పేర్కొంటూ బెయిల్‌ ఇచ్చింది. కేసుపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21వ తేదీన అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న ఆయనకు తాత్కాలిక బెయిల్‌ లభించింది. జూన్‌ 3వ తేదీన ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. జూలై 12న ఈడీ కేసులో బెయిల్‌ లభించింది.

Updated Date - Sep 14 , 2024 | 04:04 AM

Advertising
Advertising