Heart Stroke: విషాదం.. శ్రీ రాముడి ప్రదర్శన ఇస్తుండగా హార్ట్ ఎటాక్
ABN, Publish Date - Oct 06 , 2024 | 11:56 AM
దేశరాజధాని ఢిల్లీ(Delhi)లోని రామలీలాలో ప్రదర్శన ఇస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు ఢిల్లీ నివాసి సుశీల్ కౌశిక్ (45) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు.
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లోని రామలీలాలో ప్రదర్శన ఇస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు ఢిల్లీ నివాసి సుశీల్ కౌశిక్ (45) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాముడి వేషధారణలో ఉన్న కౌశిక్ ప్రదర్శన ఇస్తుండగా ఛాతిలో నొప్పితో బాధపడ్డాడు. అనంతరం ఒక్కసారిగా కుడి మోకాలిపై కూర్చున్నాడు. తిరిగి లేచి ప్రదర్శన కొనసాగించాలని చూసినా.. అది సాధ్యపడలేదు. ఛాతిపై నొప్పి తీవ్రత పెరగడంతో కంగారు పడుతూ తెరవెనక్కి పరిగెత్తాడు.
అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తోటి కళాకారులు గుర్తించి ఆనంద్ విహార్‌లోని కైలాష్ దీపక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతితో కౌశిక్ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన ప్రాపర్టీ డీలర్‌గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుండెపోటు సంకేతాలివే..
అకస్మాత్తుగా వచ్చే ఈ గుండెపోటుతో(Heart Attack) క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హార్ట్ ఎటాక్ రాకముందే గుండె లయల్లో మార్పులు కనిపిస్తాయని.. వాటిని గమనించి అప్రమత్తమైతే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు అంటున్నారు. పరిశోధన ప్రకారం .. ఏడాదికి దాదాపు 45 శాతం మంది ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొందరిలో కొన్ని వారాలపాటు గుండె లయల్లో మార్పులు సంభవించినట్లు పరిశోధనలు వెల్లడించాయి. గుండెపోటు రావడానికి సుమారు 4 నుంచి 6 రోజుల ముందు వరకు ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు.
50 శాతం కంటే ఎక్కువ మంది రోగులు గుండెపోటు సంభవించే కనీసం 48 గంటల ముందు ఛాతీ నొప్పి రూపంలో ప్రోడ్రోమల్ లక్షణాలను కలిగి ఉంటున్నారు. మహిళల్లో ఛాతి నొప్పి ఉండకపోవచ్చు. బదులుగా గుండెపోటు సంభవించే రోజుల్లో వికారం, అజీర్ణం, వెన్నునొప్పి వంటి లక్షణాలను అనుభవించవచ్చు. ఈ సంకేతాలను గమనించడం ముఖ్యమని యశోద ఆసుపత్రి వైద్యులు చెప్పారు. "గుండెపోటు సంభవించే ముందు లక్షణాలను గుర్తిస్తే సకాలంలో వైద్య సహాయం అందించవచ్చు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అప్రమత్తతతో సకాలంలో వైద్యం అందిస్తే గుండెపోటు మరణాలను తగ్గించవచ్చు" అని వివరించారు. పై లక్షణాల్లో ఏవి కనిపించినా.. డాక్టర్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి.
కుర్రాళ్లకు సువర్ణావకాశం
For Latest News and Business News click here
Updated Date - Oct 06 , 2024 | 12:06 PM