Air India: వివాదాస్పదంగా మారిన టీమిండియా విమానం.. తెరవెనుక ఇంత జరిగిందా?
ABN, Publish Date - Jul 04 , 2024 | 05:55 PM
బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ ఆటగాళ్లు జులై 4వ తేదీన ఓ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఏర్పాటు చేసిన...
బెరిల్ హరికేన్ (Beryl Hurricane) కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ ఆటగాళ్లు జులై 4వ తేదీన ఓ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ వారిని భారత్‌కు తీసుకొచ్చింది. అయితే.. ఈ విమానం ఇప్పుడు ఓ విషయంలో ఊహించని వివాదంలో చిక్కుకుంది. ముందుగా ఈ విమానాన్ని ప్రయాణికుల కోసం కేటాయించారని, అయితే చివరి నిమిషంలో రద్దు చేసి బార్బడోస్‌కు పంపించారని తెలిసింది. దీంతో.. విమానయాన నియంత్రణ సంస్థ ‘డీజీసీఏ’ రంగంలోకి దిగి, ఎయిర్ ఇండియాకు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
షెడ్యూల్ ప్రకారం.. ఆ విమానం మొదట్లో నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇంతలోనే బీసీసీఐ నుంచి భారతీయ ఆటగాళ్ల కోసం ఓ ప్రత్యేక విమానం కావాలని ఎయిర్ ఇండియాకు రిక్వెస్ట్ వచ్చింది. దాంతో.. ప్రయాణికుల షెడ్యూల్‌ని రద్దు చేసి, ఆ విమానాన్ని బార్బడోస్‌కు పంపించారు. తద్వారా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. డీజీసీఏ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ‘నెవార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని టీమిండియా కోసం పంపారా?’ అంటూ ఎయిర్‌లైన్స్‌ను నిలదీసింది. అలాగే.. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అయితే.. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా వాదన మరోలా ఉంది. ఆ విమానాన్ని బార్బడోస్‌కు పంపించడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని ఓ అధికారి వెల్లడించారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఈ విషయాన్ని వారికి ముందుగానే తెలియజేశామని అన్నారు. అయితే.. కొందరు నెవార్క్‌కు వచ్చారని, దాంతో ఓ బస్సు ఏర్పాటు చేసి వారిని న్యూయార్క్‌కు పంపించామని, అక్కడి నుంచి వారిని మరో విమానంలో ఢిల్లీకి వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. కానీ.. ఎయిర్ ఇండియా అబద్ధం చెప్తోందని, తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం సిద్ధం చేయలేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 04 , 2024 | 05:55 PM