Digvijay Singh: ఇది అమృత్ కాల్ కాదు, వినాశ్ కాల్.. ప్రధాని మోదీపై దిగ్విజయ్ ధ్వజం
ABN, Publish Date - Feb 15 , 2024 | 03:26 PM
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా మోదీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలిపేందుకు రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. దేశంలో అన్నదాతలకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా మోదీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలిపేందుకు రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. దేశంలో అన్నదాతలకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రభుత్వానికి దాదాపు పదేళ్లు అయ్యిందని, ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు కొమ్ముకాసిందని దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేశారు. ఇది అమృత్ కాల్ కాదని, వినాశ్ కాల్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మోదీ పాలనపై ఒక రిపోర్ట్ విడుదల చేశామని.. ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రధాని చేసిన అన్యాయాలను పొందుపరిచామని చెప్పారు. దేశ రక్షణ విషయంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని తేర్పారపట్టారు. రక్షణ శాఖ మంత్రి ఒకటి చెప్తే, మోదీ మరొకటి చెప్తారని దుయ్యబట్టారు. ప్రేమను పంచేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేస్తుంటే, మోదీ మాత్రం ద్వేషాన్ని పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసుదైక కుటుంబం తమ ఆలోచన అని, కానీ బీజేపీ దేశ ప్రజలను విడగొడుతోందని వ్యాఖ్యానించారు.
పీవీ నరసింహారావు కాలంలోనే రామాలయం ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ మొదటి నుంచి ఆలోచించిందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. సనాతన ధర్మం ప్రకారం.. ఆలయ నిర్మాణం పూర్తయ్యాకే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, కానీ ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేశారని విమర్శించారు. సతీసమేతంగా కలిసి చేయాల్సిన పూజను మోదీ, మోహన్ భగవత్ ఒక్కొక్కరే నిర్వహించి.. సనాతన ధర్మాన్ని కించపరిచారని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చాక మోదీ లాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. మోదీ పాలనలో పేదవాళ్లు మరింత పేదవారిగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈసారి కేంద్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం తమ మొదటి లక్ష్యమని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, భూసేకరణలో అన్నదాతలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆయన.. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల్ని బీజేపీ సర్కార్ నిలవరించలేకపోయిందని విమర్శించారు.
Updated Date - Feb 15 , 2024 | 03:26 PM