Maharashtra : దేవేంద్రుడికే సింహాసనం!
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:37 AM
దేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. ఇక తేలాల్సింది ముఖ్యమంత్రి ఎవరు? అనేదే..!
మహారాష్ట్ర సీఎం పదవి ఫడణవీస్‌కే..
శిందేకు మరోసారి అవకాశం లేనట్లే
కూటమిలో బీజేపీకి భారీ మెజారిటీ..
డిప్యూటీలుగా శిందే, అజిత్ పవార్?
న్యూఢిల్లీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. ఇక తేలాల్సింది ముఖ్యమంత్రి ఎవరు? అనేదే..! అయితే, మహాయుతిలోని పార్టీలలో సీఎం పదవి పంచాయితీ తలెత్తకుండా.. ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కూడిన ఈ కూటమిలో బీజేపీ అత్యధిక సంఖ్యలో 133 సీట్లు గెలిచింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి ఇది 12 సీట్లే తక్కువ. శివసేన 57, ఎన్సీపీ 40 సీట్లు సాధించాయి. బీజేపీ 80 శాతంపైగా స్ట్రయిక్ రేట్‌తో అత్యధిక స్థానాలు సాధించడంతో సీఎం ఏ పార్టీ నుంచో తేలిపోయింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం, 2014-19 మధ్యన సీఎంగా పని చేసిన దేవేంద్ర ఫడణవీస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సీఎం ఏక్‌నాథ్ శిందే మరోసారి ఆశలు పెట్టుకున్నప్పటికీ నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
పార్టీకి వీర విధేయుడు, ఎన్నికల్లోనూ విజయపథాన నడిపించడంతో ఫడణవీస్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలోనే దేవేంద్రకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీంతో ఫడణవీ్‌సనే సీఎం చేస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. షా.. శిందేకు సైతం ఫోన్ చేసి అభినందించారు. కాగా, సోమవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అదే రోజు మహాయుతి కూటమి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26న కొత్త సీఎం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. శిందే శివసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నాయకుడి ప్రజాదరణతోనే కూటమికి ఇంతటి విజయం దక్కిందని, ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
శివసేన నాయకుడు నరేష్ మాస్కే మాట్లాడుతూ.. మహాయుతిపై ప్రజలు విశ్వాసం ఉంచారని, శిందేను బాల్ థాక్రే అసలైన వారసుడిగా తేల్చారని ప్రకటించారు. మరోవైపు, ఏడాదిన్నర కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని చీల్చి, శిందే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిస్తోంది. ‘ఎప్పుడూ ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాలా?’ అంటూ గతంలో నిట్టూర్చిన అజిత్.. ఈ ఎన్నికల్లో 40 సీట్లు సాధించారు. బీజేపీ గణనీయ స్థానాలు నెగ్గడంతో ఆయనకు మారు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
నాడు శివసేన పరిస్థితే నేడు శిందే సేనకు
ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి శివసేనకు ఎదురైన పరిస్థితే నేడు శిందే సారథ్యంలోని శివసేనకు ఎదురవడం గమనార్హం. 2019లో బీజేపీ 105, ఉమ్మడి శివసేన 56 సీట్లు నెగ్గాయి. వంతులవారీగా సీఎం పదవి చేపట్టడంపై బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో ఉద్ధవ్ థాక్రే కాంగ్రె్‌సతో జట్టు కట్టారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చిన శిందే.. బీజేపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కూడా వచ్చి చేరారు.
విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లోకి..
విద్యార్థి దశలోనే ఆర్‌ఎ్‌సఎ్‌సలోకి.. 27 ఏళ్లకే నాగపూర్ వంటి పెద్ద నగరానికి మేయర్.. 44 ఏళ్ల వయసుకే సీఎం.. ఇదీ ఫడణవీస్ ప్రస్థానం. ప్రస్తుతం 54 ఏళ్లున్న ఆయన.. మహారాష్ట్రకు మూడోసారి సీఎం కాబోతున్నారు. 1970లో పుట్టిన ఫడణవీస్.. 1997లో నాగపూర్ మేయర్‌గా పనిచేశారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో బీజేపీ తరపున తొలిసారి మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సీఎం పదవిని రెండోసారి చేపట్టినప్పటికీ మెజారిటీ లేకపోవడంతో ఐదు రోజుల్లోనే దిగిపోయారు.
కూటమి నిర్ణయిస్తుంది: ఫడణవీస్
కాబోయే సీఎం ఎవరనేది మహాయుతి కూటమి నిర్ణయిస్తుందని, ఈ విషయంలో వివాదం ఏమీలేదని ఫడణవీస్ స్పష్టం చేశారు. ఒక్కటిగా ఉంటే భద్రంగా ఉంటాం’ అనే తమ నినాదానికి మద్దతు లభించిందన్నారు. బీజేపీతో గతంలో విభేదించి వెళ్లిపోయిన ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేనను ఉద్దేశిస్తూ.. అసలైన శివసేన ఏదో ప్రజలు తేల్చారని అన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 08:13 AM