Elections: లోక్‌సభ ఎన్నికల సందడి మొదలు.. రాష్ట్రంపై ఈసీ డేగ కన్ను
ABN, Publish Date - Feb 27 , 2024 | 11:55 AM
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్(Election Notification)కు ముందే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. నోటిఫికేషన్ మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
చెన్నై: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్(Election Notification)కు ముందే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. నోటిఫికేషన్ మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జనవరి నుంచే పొత్తులపై, ఎన్నికల మేనిఫెస్టోల తయారీపై, సీట్ల కేటాయింపులపై దృష్టి సారించాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు మెగా కూటములను ఏర్పాటు చేసుకునేందుకు తహతహలాడుతున్నాయి. డీఎంకే తర్వాత అన్నాడీఎంకేలోనే ఎన్నికల సందడి కన్పిస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకునేందుకు వన్నియార్ల ఓటు బ్యాంక్‌ను కలిగి ఉన్న పీఎంకే, సొంత ఇమేజ్‌తో రాష్ట్ర రాజకీయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివంగత విజయ్‌కాంత్ నెలకొల్పిన డీఎండీకే తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బీజేపీ కూడా ఎలాగైనా తమ కూటమిలోకి డీఎండీకేని చేర్చుకోవాలని ఆరాటపడుతోంది. ఇలా రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపైనే కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ముందస్తుగానే ఎన్నికల ప్రత్యేక విధులను అప్పుడే ప్రారంభించారు. గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరేట్‌లో ఇప్పటికే మూడు చోట్ల ఎన్నికల కంట్రోల్ రూంలు, ప్రత్యేక ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర డీజీపీ శంకర్‌జివాల్ కార్యాలయం, గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోనూ లోక్‌సభ ఎన్నికలకంటూ ప్రత్యేక విభాగాలు పని చేస్తున్నాయి. డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేశ్వరన్ నాయకత్వంలో 48మంది పోలీసులతో ఏర్పాటైన ఈ ప్రత్యేక నిఘా విభాగం నగరమంతటా 80 ప్రాంతాల వద్ద వాహన తనిఖీలు చేపట్టనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అత్యధికంగా ఓట్లు పోలైన పోలింగ్ కేంద్రాల వద్ద, అల్లర్లు, ఘర్షణలు జరిగిన ప్రాంతాల వద్ద, అభ్యర్థులపై నమోదైన కేసులపైనా ఈ నిఘా విభాగం ప్రస్తుతం తీవ్ర పరిశీలనలు జరుపుతోంది. గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
సౌత్‌చెన్నై, నార్త్ చెన్నై, సెంట్రల్ చెన్నై తదితర మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర చెన్నై నియోజకవర్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదే విధంగా శ్రీపెరుంబుదూరు, తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలల్లోనూ గట్టి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిఘా దళాలు ఏర్పాటు కానున్నాయి. చెన్నైలో 80 ప్రాంతాల వద్ద వాహన తనిఖీలు చేపట్టడానికి పోలీసు ప్రత్యేక దళాల అధికారులు సిద్ధమవుతున్నారు. పోలీసులతోపాటు కార్పొరేషన్ అధికారులు కూడా నగర పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో తనిఖీలు జరుపనున్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి వాహనాల్లో భారీ స్థాయిలో నగదు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం నగరమంతటా పాత నేరస్థుల వివరాలను సేకరిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడిన రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుంటామని, అల్లర్లకు అవకాశమున్న ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచనున్నామని ఆయన వివరించారు.
Updated Date - Feb 27 , 2024 | 12:00 PM