Donald Trump: బైడెన్‌తో బెడిసికొట్టిన స్నేహం.. ట్రంప్‌తో దోస్తీ.. మస్క్‌ది పెద్ద ప్లానింగే..
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:26 PM
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర వహించాడు. దీని వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నట్టు తెలుస్తోంది.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడం వెనుక స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ హస్తం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ట్రంప్ అధికారంలోకి వస్తే మస్క్ కు వచ్చే లాభమేంటి? అప్పటివరకు ఆప్త మిత్రుడిగా ఉన్న బైడెన్ తో సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయి అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది.
మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతడిని విమర్శించిన వారిలో ఎలన్ మస్క్ ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాతి ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జోబైడెన్, కమలా హారిస్ కు మద్దతునిచ్చాడు. ఆ తర్వాత బైడెన్ తో మస్క్ సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. అదే సమయంలో ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ తో మస్క్ కు దోస్తీ కుదిరింది. ఆ స్నేహంతో ఈ ఎన్నికల్లో అధ్యక్షపీఠం ఎక్కేందుకు మార్గం తేలికైంది. ఇంతకీ బైడెన్ తో మస్క్ కు ప్రాబ్లమ్ ఏంటి?.. ట్రంప్ ను తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆకాశానికెత్తాల్సిన అవసరం ఏంటి.. అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.
బైడెన్‌తో అక్కడే చెడింది..
ఇంతకుముందు తనను తాను సగం డెమొక్రాట్, సగం రిపబ్లికన్ అని అభివర్ణించుకున్న మస్క్, యూఎస్ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన వెంటనే స్వరం మార్చాడు. బైడెన్ పరిపాలన, విధానాలను విమర్శించడం మొదలుపెట్టాడు. 2021లో వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమ్మిట్‌కు తన కంపెనీ టెస్లాను ఆహ్వానించకపోవడంతో వీరి మధ్య సంబంధాలు మరింత చెడాయి. అదే ఏడాది సెప్టెంబర్లో మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ పౌర అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. అప్పుడు బైడెన్ తప్ప అందరూ మస్క్ కు అభినందనలు తెలిపారు.దీనిపై ట్విట్టర్ లో ప్రశ్నించగా.. ఆయనింకా నిద్రపోతున్నట్టున్నాడు అంటూ మస్క్ వ్యంగాస్త్రం విసిరాడు. కార్మిక సంఘాలకు బైడెన్ మద్దతు ఎక్కువగా ఉండటం వల్ల తమ కార్యకలాపాలు సజావుగా సాగడం లేదన్న అసహనం కూడా మస్క్ లో ఉంది. దీనిని గతంలో బహిరంగంగానే వ్యక్తం చేశాడు.
ట్రంప్‌కు అతిపెద్ద విద్వేశి..
2022లోమస్క్ డెమోక్రటిక్ పార్టీని "విభజన, ద్వేషపూరిత పార్టీ" అని లేబుల్ వేశాడు. 2016లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు, మస్క్ రిపబ్లికన్‌ను దూషించాడు. అతను ఆ పదవికి సరైన వ్యక్తి కాదన్నాడు. అతడి పాలనలో పని తక్కువ డ్రామా ఎక్కవ చేస్తాడంటూ చురకలు వేశాడు.
మస్క్‌ది పెద్ద ప్లానింగే..
ట్రంప్ తో దోస్తీ వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ వాటితో కలిపి మొత్తం ఆరు కంపెనీలను మస్క్ నిర్వహిస్తున్నాడు. ఇందులో కొన్ని కంపెనీలపై ప్రభుత్వ నిబంధనలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో ఉన్న సంబంధాలను వాడుకొని కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చనే ప్లాన్ లో మస్క్ ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. ట్రంప్ శిలాజ ఇంధన వినియోగానికి సమర్థిస్తున్నాడు. అయితే.. ఈవీ అనుకూల పాలసీల కొనసాగింపును మరింత మెరుగుపర్చుకొనేందుకు మస్క్ ప్రయత్నాలు కొనసాగే అవకాశం ఉంది.
Updated Date - Nov 07 , 2024 | 12:27 PM