PM Modi:శక్తినంతా ధారబోసేది ఒక్క కుటుంబం కోసమే.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
ABN, Publish Date - Feb 25 , 2024 | 05:02 PM
కాంగ్రెస్(Congress) కార్యకర్తలు, అభిమానులు తమ శక్తినంతా ధారబోసేది ఒక్క కుటుంబ బాగు కోసమేనని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. ఆ కుటుంబం అధికారం చేపట్టడానికి.. కుటుంబ పాలనతో అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ద్వారక: కాంగ్రెస్(Congress) కార్యకర్తలు, అభిమానులు తమ శక్తినంతా ధారబోసేది ఒక్క కుటుంబ బాగు కోసమేనని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. ఆ కుటుంబం అధికారం చేపట్టడానికి.. కుటుంబ పాలనతో అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గుజరాత్‌లోని ఓఖా, బేట్ ద్వారక మధ్య దేశంలోనే అతి పొడవైన కేబుల్ స్టేడ్ వంతెనతో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. "ఒక్క కుటుంబ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తన బలం మొత్తం వినియోగిస్తోంది. వారికి దేశాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో వాటిని నిలిపేశాం. ప్రజల బాగు కోసం కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించదు. టెలికాం మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే సమయంలో 2 జీ స్కాం, క్రీడా మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేటప్పుడు కామన్వెల్త్ స్కాంకి పాల్పడింది. రక్షణ శాఖలో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసే సమయంలో హెలికాప్టర్, జలాంతర్గామి స్కాంలకు పాల్పడ్డారు. వారి పాలనతో విసుగెత్తి 2014లో నన్ను ఆశీర్వదించారు. నన్ను ఢిల్లీకి పంపేముందు దేశాన్ని దోచుకోనివ్వబోనని మీకు వాగ్దానం చేశాను.
ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. కాంగ్రెస్ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలను అరికట్టాం. దోషులకు శిక్ష పడేలా చేశాం. బీజేపీ హయాంలో భారత్ టాప్ 5 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల లిస్టులో చేరింది. నవభారత నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాం. అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. వాటిల్లో ముంబయిలోని అటల్ సేతు, జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైలు వంతెన వంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. గుజరాత్‌లో అనేక పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలు అభివృద్ధి చెందాయి. అవి టూరిస్టులకు ఇష్టమైన ప్రదేశాలుగా మారాయి. ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భారత్‌లో పర్యటించిన 85 లక్షల మంది పర్యాటకులలో 5వ వంతు గుజరాత్‌ను సందర్శించారు" అని మోదీ అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 25 , 2024 | 05:02 PM