Gali Janardhan Reddy: ‘గాలి’ రాకతో కమలంలో జోష్.. ఏకమైన పాత మిత్రులు
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:37 PM
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరిపోవడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
- తిరిగి రావడం సంతోషకరం: శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి
బళ్లారి(బెంగళూరు): మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరిపోవడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సోమవారం ఆయన అనుచరులతో కలిసి బెంగళూరులో బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతల ఆధ్వర్యంలో కాషాయం కండువా కప్పుకొన్నారు. ఈ రాజకీయ పరిణామం ప్రత్యేకించి కల్యాణ కర్ణాటక జిల్లాల్లో కొంత బీజేపీకి అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గాలి జనార్దన్‌రెడ్డి చేరడంతో తన మిత్రుడు, ఎంపీ అభ్యర్థి శ్రీరాములు, ఆయన సోదరుడు, బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేరడం మంచి పరిణామమని పేర్కొన్నారు. బెంగళూరులో గాలితో పాటు ఆయన వర్గీయులు మున్నాబాయ్, దమ్మూరు శేఖర్, బీవీ శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్రామిరెడ్డి, బళ్లారి, గంగావతి, సిరుగుప్ప, సండూరు నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిన వారంతా బీజేపీలో చేరారు. రాజకీయంగా గాలి జనార్దనరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తనకు కావాలనుకున్న వాటి కోసం ఎంతకైనా తెగిస్తారనే పేరు ఉంది. గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖర్‌రెడ్డి, పక్కీరప్ప తదితరులు కలిసి బీజేపీకి ఒక ఊపు తెచ్చారు. 2008 నుంచి ఇక్కడ బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేశారు.
రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు. ఇంత కాలం తాను పెంచిన మనుషులే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొన్ని బహిరంగ సభల్లో విమర్శించారు. మాజీ మంత్రి శ్రీరాములు, తన సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డిపై గాలి జనార్దన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబం బహిరంగా విమర్శించింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కేఆర్‌పీపీ తరపున గాలి జనార్దన్‌రెడ్డి సతీమణి గాలి లక్ష్మీఅరుణపై సోమశేఖర్‌రెడ్డి పోటీకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కలిసి ప్రచారం చేస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకంతో బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో అభ్యర్థుల విజయానికి గాలి జనార్దనరెడ్డి తన పాత పాచికలు వేస్తారని, వారి గెలుపు సులభం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద గాలి జనార్దనరెడ్డి వర్గం తిరిగి బీజేపీలో చేరడంతో కమలంలో జోష్ వచ్చింది.
Updated Date - Mar 26 , 2024 | 12:37 PM