Heavy Rains: ముంబైలో కుంభవృష్టి.. స్తంభించిపోయిన మహా నగరం
ABN, Publish Date - Sep 26 , 2024 | 07:27 AM
దేశ ఆర్థిక రాజధాని, మహా నగరం ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని, మహా నగరం ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.
అంధేరిలో ఓ మహిళ మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందింది. సెర్చ్ ఆపరేషన్‌లో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. భారీ వర్షాల ప్రభావంతో బుధవారం రాత్రి పలు విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఓ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా హైదరాబాద్‌కు మళ్లించారు. విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా పలు విమానాలను దారి మళ్లించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రయాణీకులకు వెల్లడించాయి.
‘‘ భారీ వర్షం కారణంగా ముంబైలో వాతావరణం బాగాలేకపోవడం పర్యవసానంగా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే, లేదా ఇక్కడికి విమానాలు ప్రభావితం కావొచ్చు. ప్రయాణీకులు వారి విమాన స్టేటస్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి’’ అని ప్రయాణీకులకు స్పైస్‌జెట్ సూచన చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ప్రకటన విడుదల చేసింది.
స్కూళ్లు, కాలేజీలకు సెలవు
గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ముంబై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముంబై పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసింది. అత్యంత భారీ వర్షాలు కురవచ్చని, ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో తీవ్ర వర్షాలు, వరదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేడు నగరంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Updated Date - Sep 26 , 2024 | 07:29 AM