Fenjal Cyclone: రాష్ట్రాన్ని వదలని వర్షాలు
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:34 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంకా వీడలేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లాలో రోడ్లపై నీరు ప్రవహించింది.
కోస్తాలో పంటలకు నష్టం.. పెన్నాలో ఆకస్మిక ప్రవాహం
నదిలో చిక్కుకుపోయిన పశువుల కాపరులు
పడవల ద్వారా కాపాడిన అధికారులు
తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం
కోస్తా, రాయలసీమకు వర్షసూచన
నేడు వరి కోతలు కోయవద్దని సూచన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంకా వీడలేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లాలో రోడ్లపై నీరు ప్రవహించింది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉన్న వాయుగుండం మరింత బలహీనపడి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రం నుంచి భారీగా తేమ భూ ఉపరితలంపైకి రావడంతో ఆదివారం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరులో 122.2, గూడూరు మండలం దారకానిపాడులో 109, కందుకూరు మండలం ఆనందపురంలో 95.25, ఓలేటిపాలెం మండలం నలందలపూర్‌లో 95, లింగసముద్రంలో 90.2, భీమవరంలో 88.5, ఉలవపాడులో 86.4, వలేటివారిపాళెంలో 80, ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోట్లపల్లిలో 79.5, బోగోలులో 77.6, కాకినాడ జిల్లా కాజులూరులో 71.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోస్తాలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అందువల్ల కోస్తాలో రైతులు మంగళవారం వరి కోతలు కోయవద్దని సూచించారు. బుధవారం నుంచి కొంతమేర ఆకాశం నిర్మలంగా మారుతుందని అంచనా వేశారు.
పశువుల కాపరులను కాపాడిన అధికారులు
పెన్నానది మధ్యభాగంలోకి పశువుల్ని మేపేందుకు వెళ్లిన ఆరుగురు కాపరులు ఆకస్మిక ప్రవాహం రావడంతో చిక్కుకుపోయారు. వారిని అధికారులు కాపాడారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెంకు చెందిన మదనపల్లి నవీన్, చల్లకొలును కావమ్మ, కత్తి గోవింద్, చలంశెట్టి పోలయ్య, కత్తి గణేశ్, కత్తి వెంకటరమణయ్య సోమవారం పశువుల్ని తోలుకుని పెన్నానదిలోకి వెళ్లారు. నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారంతా నది మధ్యభాగంలో చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా ఉన్నతాధికారుల్ని అప్రమత్తం చేయడంతో అగ్నిమాపక సిబ్బంది పడవల ద్వారా ఆ ఆరుగురిని కాపాడారు. దీంతో అధికారులను ఎమ్మెల్యే అభినందించారు.
Updated Date - Dec 03 , 2024 | 04:34 AM