Vikramaditya Singh: ట్విస్ట్ ఇచ్చిన మంత్రి...రాజీనామా వెనక్కి
ABN, Publish Date - Feb 28 , 2024 | 09:24 PM
హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
ప్రభుత్వానికి ఢోకా లేదు..
రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అనంతరం మీడియాతో విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ, పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. పార్టీ విస్తృత ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా ఉదయం తాను ఇచ్చిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదని, మరింత ఒత్తిడి తీసుకురావాలని తాను కూడా అనుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని స్పష్టం చేశారు. దీనికి ముందు, మంగళవారం జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం అధికార కాంగ్రెస్‌ను కుదిపేసింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం, బీజేపీ అభ్యర్థి గెలుపొందటంతో సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం మనుగడపై అనుమానాలకు తావిచ్చింది. కొద్ది గంటల్లోనే విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో సంక్షోభం ముదిరినట్టే కనిపిచింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక దూతలను హుటాహుటిన సిమ్లాకు పంపింది.
Updated Date - Feb 28 , 2024 | 09:28 PM