స్నేహితుడిని కొట్టి తరిమేసి..
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:15 AM
తమిళనాడు రాజధాని చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
చెన్నై నడిబొడ్డున అన్నా వర్సిటీలో ఘోరం
ఆపై యువతి నగ్న వీడియో చిత్రీకరణ.. నిందితుల్లో ఒకరి అరెస్టు
చెన్నై, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజధాని చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 23న రాత్రి 8 గంటల సమయంలో వర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలోని ఓ భవనం వెనుక ఆమె, తన స్నేహితుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముందుగా ఆమె స్నేహితుడిని కొట్టి తరిమేసి, ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు. ఘటనపై మంగళవారం రాత్రి ఆ యువతి స్థానిక కొట్టూర్పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అత్యాచారం అనంతరం తనను నగ్నంగా వీడియో తీసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్న ఆ యువతి స్వస్థలం కన్యాకుమారి జిల్లా అని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, దర్యాప్తు మ్మురం చేసి, సాంకేతిక ఆధారాలతో వర్సిటీకి సమీపంలో ఉన్న కొట్టూర్పురానికి చెందిన జ్ఞానశేఖరన్(37)ను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఫుట్‌పాత్‌పై బిర్యానీ విక్రయించే ఇతడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థిని అత్యాచార ఘటనను ఖండిస్తూ ఎస్‌ఎ్‌ఫఐ, ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఈ ఘటన రాష్ట్రానికే సిగ్గు చేటు అని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ తీరును ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ సంఘటనే తార్కాణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు.
Updated Date - Dec 26 , 2024 | 05:15 AM