Vande Bharath: పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే
ABN, First Publish Date - 2024-02-08T10:22:19+05:30
వందేభారత్(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది.
ఢిల్లీ: వందేభారత్(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. వందేభారత్ రైళ్ల సేవలకు సంబంధించి పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. “దేశవ్యాప్తంగా జనవరి 31 నాటికి 82 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు, కొత్త ట్రాక్‌ల నిర్మాణాలను చేపట్టాం. 10 వేల 981 రూట్లలో రైళ్ల గరిష్ఠ వేగాన్ని 130 కి.మీ.లకు పెంచాం. పరిమిత రూట్లలో 160 కి.మీ.ల మేర వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, వందే భారత్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 96.62 శాతంగా ఉంది. ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, రిక్లైనింగ్ ఎర్గోనామిక్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రివాల్వింగ్ సీట్లతో సౌకర్యవంతమైన సీటింగ్, ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు మొదలైన సదుపాయాలు ఈ రైళ్లలో ఉన్నాయి" అని వైష్ణవ్ వివరణ ఇచ్చారు.
వందే భారత్ ప్రత్యేకతలివే..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేసిన సెమీ-హై స్పీడ్, స్వీయ చోదక రైలు. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఇవి ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. గరిష్టంగా 160 km/h వేగంతో నడిచేలా వీటిని రూపొందించారు. ఇందులో GPS, వైఫై, సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2024-02-08T10:23:54+05:30 IST