Kamal nath: మీకే ముందు చెబుతాగా? ఉత్కంఠ పెంచిన కమల్‌నాథ్..
ABN, Publish Date - Feb 17 , 2024 | 05:17 PM
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు వెలువడటం, ఇందుకు తగ్గట్టుగా ఆయన తన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్‌తో శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోవడంతో హస్తినలో ఎంపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు కమల్‌నాథ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ''అలాంటిదేమైనా ఉంటే ముందే మీకు చెబుతాను'' అని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కాంగ్రెస్ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamalnath) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు వెలువడటం, ఇందుకు తగ్గట్టుగా ఆయన తన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్‌తో శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోవడంతో హస్తినలో ఎంపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు కమల్‌నాథ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ''అలాంటిదేమైనా ఉంటే ముందే మీకు చెబుతాను'' అంటూ వ్యాఖ్యానించారు. మరీ అంతగా ఎగ్జయిట్ కావద్దని మీడియాకు సూచించారు.
బీజేపీలో చేరడం లేదని సూటిగా మీరు చెప్పడం లేదని ఓ విలేఖరి తరచి తరచి ప్రశ్నించగా... ''ఇది తోసిపుచ్చడానికి సంబంధించిన విషయం కాదు. మీరు ఏదో చెబుతున్నారు. మీరు ఎగ్జయిట్ అవుతున్నారు. నేను మాత్రం ఈవైపా, ఆవైపా అనే విషయంలో ఎలాంటి ఆదుర్దా పడటం లేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మొదట మీకే చెబుతాను'' అంటూ ఆయన ముందుకు కదిలారు.
కాగా, పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రస్థానం సాగిస్తున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును ఆశించారు. ఇందుకు రాహుల్ సహా కాంగ్రెస్ అధిష్ఠానం నిరాకరించింది. దిగ్విజయ్ సింగ్ విధేయుడైన అశోక్ సింగ్‌కు టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గుచూపింది. దీంతో నకుల్ నాథ్ తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ ట్యాగ్ తొలగించారు. ఆ వెంటనే తండ్రీకొడుకులిద్దరూ పార్టీ ఫిరాయించనున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. కమల్‌నాథ్ పార్టీకి విధేయుడని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ గట్టిగా చెబుతున్నప్పటికీ కమల్‌నాథ్ ద్వయం బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు బీజేపీ వర్గాలు కుండబద్ధలు కొడుతున్నాయి.
Updated Date - Feb 17 , 2024 | 05:17 PM