IMA : రాత్రిపూట డ్యూటీ.. భయం భయం!
ABN, Publish Date - Aug 31 , 2024 | 04:15 AM
దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి(ఐఎంఏ) అధ్యయనంలో వెల్లడైంది.
దేశంలో మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలోనే
మహిళా డాక్టర్లలో మరింత భయం
ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు
45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్‌లు,విశ్రాంతి గదులు కూడా కరువు
ఉన్నవాటిలో బాత్‌రూమ్‌లూ లేవు
ఐఎంఏ ఆన్‌లైన్ అధ్యయనంలో వెల్లడి
22 రాష్ట్రాల్లో 3,885 మందితో సర్వే
న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి(ఐఎంఏ) అధ్యయనంలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట విధులంటే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపింది. పురుష వైద్యులకంటే మహిళా వైద్యులు మరింత అభద్రతాభావంలో ఉన్నారని, వారిలో కొందరు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వెంటబెట్టుకుని వస్తున్నారని అధ్యయనం పేర్కొంది.
ఆసుపత్రుల్లో భారీగా ఉంటున్న రోగులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం, డ్యూటీ రూమ్‌లు కూడా ఉండకపోవడంతో వైద్యులు అభద్రభావంతో ఉన్నారని తెలిపింది. వైద్యులకు సరైన భద్రత, సౌకర్యాలు కల్పిస్తే.. తద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలను ఐఎంఏ వివరించింది. కాగా, ఈ సర్వే వివరాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు అందించనున్నట్టు ఐఎంఏ కేరళ విభాగం, పరిశోధన సెల్ చైర్మన్ డాక్టర్ జయదేవన్ తెలిపారు.
వైద్యుల గోడు ఇదీ..
రాత్రి విధుల్లో ఉన్న వైద్యులకు 45 శాతం ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్‌లు లేవు. దీంతో నైట్ డ్యూటీలో ఉంటున్నవారు తీవ్ర అభద్రతలో ఉంటున్నామనే భావనలో ఉన్నారు. కచ్చితంగా తమకు డ్యూటీ రూమ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
డ్యూటీ రూమ్ ఉన్నప్పటికీ.. తమకు గోప్యత ఉండడం లేదని, భారీ సంఖ్యలో వస్తున్న రోగుల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో ఎటాచ్డ్ బాత్‌రూమ్స్ లేవని మరికొందరు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా తమకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలన్నారు.
ఆసుపత్రుల్లో భద్రత లేదని 24.1% మంది, అస్సలు ఏమాత్రం సురక్షితం కాదని 11.4% మంది వైద్యులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళా వైద్యులే ఉన్నారు. ‘‘సుశిక్షితులైన సిబ్బందితో ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలి. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయాలి’’ అని వారు కోరారు.
సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్(సీపీఏ)ను అమలు చేయాలి. అలారం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వైద్యులకు కనీస భద్రత కల్పించాలి.
రోగులు ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో గుంపు నియంత్రణ సిబ్బందిని నియమించాలి. తద్వారా రోగులకు నిర్భయంగా వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఆత్మ రక్షణ కోసం చిన్నపాటి ఆయుధాలను తీసుకువెళ్తున్నట్టు సర్వేలో కొందరు తెలిపారు.
తన హ్యాండ్ బ్యాగులో చిన్నపాటి కత్తితో పాటు మిరియాల ద్రావకాన్ని కూడా పెట్టుకుంటున్నట్టు ఓ మహిళా వైద్యురాలు తెలిపారు.
రోగుల బంధువులు కొందరు మద్యం తాగి, మరికొందరు మాదద్రవ్యాల మత్తులో జోగుతూ వైద్యులను బెదిరిస్తున్నారని మెజారిటీ వైద్యులు ఫిర్యాదు చేశారు. వీరిని కట్టడి చేయాలని కోరారు.
మహిళా వైద్యులను కొందరు తాకరాని చోట తాకుతున్నారు. రోగుల సమూహం ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రతను ప్రశ్నిస్తే.. యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. చులకనగా చూస్తున్నాయి. జూనియర్ వైద్యులపై దాడులు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి.
సర్వే సాగింది ఇలా..
22 రాష్ట్రాల్లో ఐఎంఏ ఆన్‌లైన్ అధ్యయనం సాగింది. మొత్తం 3,885 మంది వైద్యులు పాల్గొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 85ు మంది 35 ఏళ్లలోపున్న వైద్యులు. వీరిలో 61ు మంది ఇంటెర్న్, లేదా పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనీలే.
Updated Date - Aug 31 , 2024 | 07:06 AM