Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:51 PM
మధ్యప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మహిళలపై వేర్వేరుగా లైంగిక దాడి జరిగింది. రేవాలో పిక్నిక్ వెళ్లిన దంపతులపై దాడి చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై లైంగిక దాడి చేశారు.
భోపాల్, అక్టోబర్ 25: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటే చేసుకుంది. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి తెగబడ్డారు. రేవాలో భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై లెంగిక దాడి చేశారు. అంతేకాకుండా దానిని వీడియో సైతం తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేస్తామని దంపతులను బెదిరించారు. ఈ ఘటన అక్టోబర్ 21వ తేదీన చోటు చేసుకుంది. ఈ ఘటనపై దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పలువురు అనుమానితులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. దంపతులు పిక్నిక్‌లో భాగంగా రేవాకు వచ్చారని తెలిపారు. ఆ క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుందని పేర్కొన్నారు.
ఇండోర్‌లో దారుణాతి దారుణం...
ఇక మరో ఘటన దేశంలోనే అత్యంత పరిశ్రుభమైన నగరంగా పేరు పొందిన ఇండోర్‌లో చోటు చేసుకుంది. నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది. అనంతరం బాధితురాలు అయిన మహిళ.. సదర్ బజార్ ప్రాంతంలో అర్థనగ్నంగా తిరుగుతుండడాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గమనించారు. దీంతో అంతకు ముందు ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు నిర్థారణ చేసుకున్నారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి సోనుగా గుర్తించారు. నిందితుడు సోనుగా నిర్ధారించి.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు ప్రశ్నించారు. తానే ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోను దినసరి కూలిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ రెండు వేర్వేరు ఘటనల్లో లైంగిక దాడి జరిగిన మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అధికార బీజేపీని నిలదీసిన పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ..
ఈ వరుస ఘటనలపై మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈవెంట్‌లో ఉంటే... ఓ ఆడ కూతురు రోడ్డుపై నగ్నంగా తిరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇండోర్ మహిళను ఆయన పంచమవేదం మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చారు, తనను తాను దేవుడుగా భావించే ముఖ్యమంత్రి ఈ ద్రౌపది వస్త్రాపహారణాన్ని చూడలేదా? అని ప్రశ్నించారు. మా ఆడబిడ్డల దీనస్థితిపై తనకు కోపంగా, ఆందోళనగా ఉందన్నారు. మా ఆడబిడ్డలపై నేరాలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాత్రం కళ్లు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం గతంలో లాడ్లీ బెహన్ యోజన పథకాన్ని తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. ఈ పథకం మరోమారు బీజేపీని అధికారంలోని తీసుకు వచ్చేందుకు దోహదపడిందని పీపీసీ చీఫ్ జీతూ పట్వారీ స్పష్టం చేశారు. అలాంటి రాష్ట్రంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన రాష్ట్ర మంత్రి..
దీనిపై మోహన్ యాదవ్ కేబినెట్‌లోని మంత్రి నరేంద్ర పటేల్ స్పందించారు. ఈ తరహా ఘటనల్లో నిందితులను బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోదన్నారు. ఇండోర్ ఘటనలో నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు. ఇండోర్ ఘటనలో నరాల వ్యాధితో బాధపడుతున్న మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కలకలం సృష్టించిన ఉజ్జయినీ ఘటన
2023, సెప్టెంబర్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. దీంతో తీవ్ర గాయాలైన బాధితురాలు తనను ఆసుపత్రికి తరలించాలంటూ ఇంటింటికి తిరుగుతు పలువురు స్థానికులను ప్రాధేయపడింది. కానీ ఏ ఒక్కరు ఆమె ధీన స్థితిని పట్టించుకోలేదు. అయితే దేవాలయం పూజారీ మాత్రం వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అనంతరం మళ్లీ ఆ తరహా ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి.
For National News And Telugu News.
Updated Date - Oct 25 , 2024 | 04:14 PM