ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1.5 డిగ్రీల ముప్పు

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:00 AM

ఎండాకాలంలో భరించలేనంత వేడి. బయటికెళ్తే నెత్తి మాడ్చేసేంత ఎండ. చలికాలంలో భయంకరమైన చలి.

2024 ముగిసిపోవచ్చింది. మరికొద్దిరోజుల్లో కొత్త ఏడాదిలోకే కాదు.. కొత్త ప్రమాదంలోకీ అడుగుపెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకుందామంటూ 2015లో ప్రపంచదేశాలు పారి్‌సలో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని.. ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్‌ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతోంది! ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరగని ఉష్ణోగ్రతలు.. వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు.. చలిదేశాల్లో నదులు ఎండిపోవడం.. ఎడారుల్లో వరదలు.. కార్చిచ్చు ఘటనలు పెరిగిపోవడం వంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇకనైనా మానవాళి మేలుకుని భూతాపానికి చెక్‌పెట్టే సమర్థమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగకూడదని 2015లో పారిస్‌లో ఒప్పందం

భూతాప నియంత్రణలో విఫలం 2023లోనే దాటేశాం

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు

(సెంట్రల్‌ డెస్క్‌)

ఎండాకాలంలో భరించలేనంత వేడి. బయటికెళ్తే నెత్తి మాడ్చేసేంత ఎండ. చలికాలంలో భయంకరమైన చలి. వానాకాలంలో ఆనకట్టలు తెగిపోతాయేమో అన్నంత స్థాయిలో వరదలు.. ఇదీ కొన్నేళ్లుగా మన దేశంలో పరిస్థితి! ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటీవలికాలంలో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి. దీనికి కారణం.. భూతాపం. నానాటికీ పెరుగుతున్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయి. మన భూమి సగటు ఉష్ణోగ్రత.. నాసా లెక్కల ప్రకారం 15 డిగ్రీలు. కానీ, పారిశ్రామికీకరణవల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, మానవ జీవనశైలిలో భారీ మార్పుల (ఏసీలు, ఫ్రిజ్‌లు, జనరేటర్లు, ఇన్వర్టర్ల వంటివాటి వాడకం పెరిగిపోవడం) కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పారిశ్రామిక యుగం మొదలైన తర్వాత భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం మొదలై ఆ ప్రభావం ప్రకృతిపై పడింది.

దీనివల్ల హిమనీనదాలు, ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచు భారీగా కరిగి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరిగాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో సైతం పెనుమార్పులు సంభవించి.. రుతువులు గతి తప్పడం మొదలైంది. సకాలంలో వానలు కురవకపోవడం.. కురిస్తే కుంభవృష్టిగా ముంచెయ్యడం.. ఎండాకాలంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. ఒక ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టి.. ఇలా తీవ్రస్థాయిప్రకృతి విపత్తులు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిని ఊహించే.. ప్రపంచ దేశాల ప్రతినిధులు 2015లో దాదాపు రెండువారాలపాటు పారి్‌సలో సమావేశమై పర్యావరణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850-1900 నాటికి ఎంత ఉన్నాయో.. దానికి 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా చూసుకోవాలన్నది దాని సారాంశం. ఈమేరకు కర్బన ఉద్గారాలను దశలవారీగా తగ్గించుకునేందుకు ప్రపంచదేశాలకు వెసులుబాటు కల్పించారు. కానీ.. ఒక్క 2023లోనే ప్రపంచదేశాల చర్యలు భూతాపాన్ని 1.49 డిగ్రీల మేర పెంచాయని, ఇప్పుడు ఆ పరిమితిని కూడా దాటేశామని లీడ్స్‌, లాంకస్టర్‌ వర్సిటీల పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


రెండు కారణాలు..

భూతాపానికి రెండు కారణాలుంటాయి. ఒకటి ప్రకృతి సహజమైనది, రెండోది మానవ కారకం. మానవుల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణంలో మార్పులు కలగడం మొదలైంది 1850ల నుంచి అని శాస్త్రజ్ఞులు ఇన్నాళ్లుగా భావిస్తున్నారు. కానీ లీడ్స్‌, లాంకస్టర్‌ వర్సిటీల పరిశోధకులు.. ప్రాచీన మంచు ఫలకాలపై చిక్కుకుపోయిన వాయువులను విశ్లేషించి, మానవ కారక పర్యావరణ మార్పులు 1700 నుంచే ప్రారంభమైనట్టు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. 2015లో పారి్‌సలో జరిగిన కాప్‌ 21 సదస్సులో సమావేశమైన ఐపీసీసీ లెక్కల ప్రకారం మానవుల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలు 1.31 డిగ్రీల సెల్సియస్‌ అయితే.. లీడ్స్‌, లాంకస్టర్‌ వర్సిటీ పరిశోధకుల లెక్కల ప్రకారం అది ఎప్పుడో 1.5 డిగ్రీలు దాటిపోయింది!! కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) కూడా 2024 ముగిసేనాటికి భూమి సగటు ఉష్ణోగ్రత ఆ 1.5డిగ్రీలను దాటబోతున్నట్టు అంచనా వేసింది. .

అగ్రదేశాలు డబ్బులిచ్చేనా?

కోపెన్‌హ్యాగన్‌లో 2009లో జరిగిన కాప్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పారిశ్రామికీకరణతో లాభపడ్డ అమెరికా, ఐరోపా దేశాలు.. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలనుకునే దేశాలకు పదిహేనేళ్లపాటు ఏడాదికి 100 బిలియన్‌ డాలర్ల సాయం చేయాల్సి ఉంది. కానీ, ఆ హామీని అవి నిలబెట్టుకోలేదు. 2020 నుంచి మొదలుపెట్టి నాలుగేళ్లు మాత్రమే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో.. కిందటి నెలలో (నవంబరు 11-22 నడుమ) అజర్‌బైజాన్‌లోని బకులో జరిగిన కాప్‌-29 సదస్సులో ఇది ప్రధాన అంశంగా మారింది. ఏడాదికి 100 బిలియన్‌ డాలర్లు కాదని.. అభివృద్ధి చెందిన దేశాలు ‘క్లైమేట్‌ ఫైనాన్స్‌’ కింద ఏడాదికి లక్ష కోట్ల డాలర్ల చొప్పున ఇవ్వాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్‌ చేశాయి. కానీ.. చివరికి ఏటా 300 బిలియన్‌ డాలర్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే.. 2015 నుంచి 24 నడుమ 100 బిలియన్‌ డాలర్లే ఇవ్వని దేశాలు 300 బిలియన్‌ డాలర్లు ఇస్తాయా? అన్నది.. ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్న!!

1.5 డిగ్రీల పరిమితి దాటితే?

భూతాపం 1.5 డిగ్రీల పరిమితి దాటితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి కొన్నిరకాల సముద్ర జీవులు వేరే ప్రాంతాలకు వలసవెళ్లిపోతాయి. దీనివల్ల సముద్ర జీవావరణం దెబ్బతింటుంది. అలా వేరే ప్రాంతాలకు వలస వెళ్లలేని జీవులు, పగడపు దీవులు అంతరించిపోతాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో కొన్ని దీవులు మునిగిపోతాయి. సముద్ర పర్యావరణం దెబ్బతినడంతో ఆహార సరఫరా శృంఖలానికి (ఫుడ్‌ సప్లై చైన్‌) విఘాతం కలుగుతుంది. ధ్రువపు మంచు కరిగి సముద్రమట్టాలు పెరగడంతో తీరప్రాంతాలు మునిగిపోతాయి. వీటన్నింటివల్లా ఏడాదికి 11 ట్రిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం.. కార్చిచ్చు ఘటనలు పెరిగి వాయుకాలుష్యం ప్రబలుతుంది. సమయం సందర్భం.. రుతువులతో సంబంధం లేకుండా.. వానలు కురుస్తాయి. కరువులు వేధిస్తాయి. ఫలితంగా పేదరికం పెచ్చరిల్లుతుంది.

Updated Date - Dec 23 , 2024 | 04:00 AM